టిక్‌టాక్‌కు ట్రంప్‌ డెడ్‌లైన్‌.. 45 రోజులు మాత్రమే..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2020 4:43 PM IST
టిక్‌టాక్‌కు ట్రంప్‌ డెడ్‌లైన్‌.. 45 రోజులు మాత్రమే..!

చైనాకు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే భారత్‌ టిక్‌టాక్‌ యాప్‌ ను నిషేదించగా.. తాజాగా అమెరికా కూడా అదే బాటలో పయనించనుంది. టిక్‌టాక్‌ యాప్‌పై నిషేదాన్ని పరిశీలిస్తున్నామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ వెల్లడించగా.. తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టారు. టిక్‌టాక్‌ కొనుగోలు విషయంలో అమెరికాకు చెందిన కంపెనీలు దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్యలు జరిపేందుకు 45 రోజుల గడువు విధించారు. ఈ లోపే అందుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆపై యూఎస్ టిక్‌టాక్‌ యూనిట్ మరే లావాదేవి జరగకుండా ఆదేశాలు జారీ చేస్తూ.. కార్య నిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సంతకం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని, జాతీయ భద్రత, రక్షణ నిమిత్తం టిక్ టాక్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ఉత్వర్యుల్లో పేర్కొన్నారు.

అమెరికాలో టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. 'వినియోగదారుల నుంచి లొకేషన్‌, బ్రౌజింగ్‌, సెర్చ్‌ హిస్టరీలకు సంబంధించి పెద్ద ఎత్తున సమాచారాన్ని దొంగిలిస్తుంది. దాని ద్వారా అమెరికన్ల వ్యక్తిగత, ఇతర సమాచారం చైనీస్ కమ్యూనిస్టు పార్టీకి చేరే అవకాశం ఉంది. ఫెడరల్‌ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల లొకేషన్‌ను ట్రాక్‌ చేయడానికి, బ్లాక్‌మెయిల్‌, కార్పొరేట్‌ గూడచర్యలం చేయడానికి చైనా ఆ సమాచారాన్ని వినియోగించే అవకాశం ఉందని' ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

చైనాతో వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో.. ఏదైనా అమెరికన్‌ కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్‌ను తమ దేశంలో నిషేధిస్తామని ట్రంప్‌ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. సెప్టెంబర్ 15కు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story