లక్షమంది తప్పకుండా చనిపోతారని అంటున్న ట్రంప్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 May 2020 2:37 PM GMTఅమెరికా.. ఎంతగానో డెవలప్ అయిన దేశం. మెడికల్ కేర్ విషయంలో వారు తీసుకునే శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఇక ఆసుపత్రుల్లో సదుపాయాలు కూడా భేషుగ్గా ఉంటాయి. అలాంటి అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, ఆపత్కాల సమయంలో సరైన నిర్ణయాలు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోలేదని చెప్పే వారు చాలా మందే ఉన్నారు. రాను రాను.. వైరస్ మరింత ప్రబలుతోంది. పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఓ వైపు తమ దేశంలోని ఫార్మా కంపెనీలు మందు కనిపెడుతూ ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నాడు ట్రంప్. అలాగే చైనాను తిడుతూ, భారీ స్థాయిలో నష్ట పరిహారం చెల్లించాలంటూ మాటలు చెబుతూ వస్తున్నాడు.
తాజాగా మాట్లాడుతూ.. 100000 మందికి పైగా అమెరికన్లు కరోనా వైరస్ కారణంగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే కోవిద్-19 కారణంగా అమెరికాలో 67000 మందికి పైగా మరణించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మరణాలు ఉండబోతున్నాయని ఇప్పటికే నిపుణులు తెలిపారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. లక్షకు పైగా చనిపోతారని తాము అంచనా వేస్తున్నామని తెలిపాడు.
వ్యాక్సిన్ తయారుచేయడంపై కూడా ఆశావహ దృక్పథంలో వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ వస్తుందని వర్చువల్ టౌన్ హాల్ లో ట్రంప్ చెప్పాడు. కానీ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ మాత్రం 12 నుండి 18 నెలలు సమయం పడుతుందని అంటున్నారు. ఫాక్స్ న్యూస్ తో మాట్లాడిన ట్రంప్ 'ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ వస్తుంది' అని అన్నాడు. ఎవరు ఏది చెప్పినా.. చెప్పకున్నా.. వ్యాక్సిన్ వీలైనంత త్వరగా వస్తుందని అన్నాడు. తన అడ్మినిస్ట్రేషన్ సరిగా పనిచేయకపోవడం వలనే అమెరికాలో కరోనా వైరస్ విపరీతంగా ప్రబలిందన్న వ్యాఖ్యలను ట్రంప్ తప్పుబట్టాడు.
మేము తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవే అని అన్నారు. అలాగే చైనాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చైనా చాలా ఘోరమైన తప్పు చేసిందని.. దాన్ని ఒప్పుకోవడం లేదని ఆరోపణలు గుప్పించాడు. కోవిద్-19 గురించి ఇంటెలిజెన్స్ అధికారులు సరైన సామాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు ట్రంప్. కానీ పలు మీడియా సంస్థలు మాత్రం ఇంటెలిజెన్స్ అధికారులు ముందుగానే ట్రంప్ కు సూచనలు చేశారట.. కానీ ట్రంప్ వైఫల్యం కారణంగానే ప్రస్తుతం కరోనా అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కానీ ట్రంప్ వ్యాఖ్యలను చాలా మంది నిపుణులు కొట్టివేస్తూ ఉన్నారు. ఇంగ్లాండ్ కు చెందిన మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ మాట్లాడుతూ ట్రంప్ చెబుతున్నట్లుగా అంత తక్కువ సమయంలో వాక్సిన్ రావడం కష్టమేనని అన్నారు. డాక్టర్ ఫాసీ కొద్దిరోజుల కిందట మాట్లాడుతూ 18 నెలలు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అన్నారని ప్రొఫెసర్ విట్టీ గుర్తు చేశారు. అంతకంటే తక్కువ సమయంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు.