నేడు ఆస్పత్రికి నుంచి ట్రంప్‌ డిశ్చార్జ్‌..!

By సుభాష్  Published on  5 Oct 2020 3:36 AM GMT
నేడు ఆస్పత్రికి నుంచి ట్రంప్‌ డిశ్చార్జ్‌..!

కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోవడంతో ఇటీవల కాలంలో రెండు సార్లు ఆయనకు ఆక్సిజన్‌ అందించామని శ్వేతసౌధం వైద్యులు తెలిపారు. కాగా, శుక్రవారం ఒకదశలో ఆక్సిజన్‌ 94 శాతకంటే తక్కువ పడిపోగా, ఇప్పుడు పరిస్థితి బాగుందని, జ్వరం ఏ మాత్రం లేదని వైద్యులు వివరించారు. మెరుగైన చికిత్స వల్ల కాలేయం, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ఓ వీడియో విడుదల చేస్తూ, రాబోయే కొద్దిరోజులు నిజంగా తనకు పరీక్ష కాలమని, ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. తాను కరోనాతో ఆస్పత్రిలో చేరినప్పటి కంటే ఇప్పుడు ఆరోగ్యం ఎంతో మెరుగైందని అన్నారు.

యావత్‌ ప్రపంచం తరపున కోవిడ్‌తో పోరాడుతున్నా. దాని నుంచి బయటపడతాననే ఆశాభావంతో ఉన్నా. తప్పకుండా వైరస్‌ను మట్టి కరిపిస్తా. నేను చికిత్స తీసుకుంటున్నా. అందుకే బాగున్నా అని ట్రంప్‌ వీడియోలో చెప్పుకొచ్చారు. కరోనాతో చికిత్స పొందుతున్న ట్రంప్‌ సైనిక ఆస్పత్రి నుంచి తన విధులు నిర్వర్తిస్తున్నారు.

అయితే శ్వేతసౌధంలో గదికి పరిమితమైతే సరిపోతుందని వైద్యులు చెప్పినా ప్రజలను చూడకుండా , వారితో మాట్లాడకుండా ఉండలేనని ట్రంప్‌ చెప్పారు. గదిలోనే సురక్షితంగా, బందీగా ఉండటం నా వల్ల కాదు. ఏం జరిగితే జరగనీయండి.. ఒక నేతగా సమస్యలతో పోరాడాల్సిందే అని అన్నారు. కాగా, అధ్యక్షుడి వద్ద పని చేసే భద్రత ఉద్యోగిలో మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Next Story