నాటి పొలిటికల్ హీరోలు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు..!
By అంజి Published on 19 Jan 2020 1:53 PM ISTఓడలు బండ్లయిపోతాయి. ఒకప్పుడు రాజ్యం చేసిన వారు సామాన్యులైపోతారు. కాలం కలిసిరాకపోతే కింగులు కూడా డంగైపోతారు. తెరాసలో ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులకు ఇదే పరిస్థితి. ఒకప్పుడు కేసీఆర్ కు సన్నిహితులుగా పేరొంది, ఆయన ప్రశంసలు పొందిన వారు మనుగడ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది.
ఉదాహరణకు గత అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారినే తీసుకుందాం. ఒకప్పుడు ఆయన మాటే శాసనం. శాసనసభలో ఆయనదే రాజ్యం. కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆయన పరిస్థితి “సాడేతీన్ కోన్ కిస్కా”! ఆయన సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో ఆయనను అడిగేవారు లేరు. ఆయనను ఎన్నికల్లో ఓడించి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ ను వీడి తెరాసలో చేరారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు, ప్రచారం వంటి బాధ్యతలన్నీ ఆయనకే. కేసీఆర్, కేటీఆర్ లు ఆయనతోటే మాట్లాడుతున్నారు. మధుసూదనాచారి మనుషులకు ఒకరిద్దరికి మాత్రమే టికెట్లు ఇచ్చారు. దీంతో ఆయన ప్రచారం ఆ రెండు మూడు సీట్లకే పరిమితం. మిగతా చోట్ల ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములదే వాడి. గండ్ర వెంకటరమణారెడ్డి హవాయే నడుస్తోంది.
ఇదే పరిస్థితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లోనూ ఉంది. ఇక్కడ ముందొచ్చిన చెవి జూపల్లి కృష్ణారావు. కానీ వెనకొచ్చిన కొమ్ము హర్షవర్ధన్ రెడ్డి. కృష్ణారావును ఓడించి కాంగ్రెస్ తరఫున గెలిచిన రెడ్డి గారు కండువా మార్చారు. ఇప్పుడు పెద్ద పీట ఆయనకు. కృష్ణారావు తెరమరుగు. దాంతో జూపల్లి కృష్ణారావు ఊరుకోకుండా తన మద్దతుదారులను ఫార్వర్డ్ బ్లాక్ తరఫున సింహం గుర్తుపై రంగంలోకి దింపారు. ఆయన ఇప్పుడు చురుకుగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ లు చెప్పినా ఆయన మాట వినడం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే ఆయన పరిస్థితి ఏమిటో అర్థమౌతుంది.
దాదాపు ఇలాంటి పరిస్థితే ఒకప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిది. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయింది. ఆయనను మళ్లీ రీనామినేట్ చేయలేదు. అల్లుడికి పదవి ఇస్తారనుకుంటే అదీ జరగలేదు. ఖమ్మంలో తుమ్మల పరిస్థితీ తుమ్మల్లో పొద్దుగూకినట్టుగానే ఉంది. అక్కడ ఈ రోజు అజయ్ పువ్వాడదే పైచేయి. ఒకప్పుడు చక్రం తిప్పిన తుమ్మల నాగేశ్వర రావు పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. పూలమ్మిన చోట కట్టెలు అమ్మే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద హవా నడిపించి, హీరోలుగా నిలిచిన ఒకప్పటి నేతలు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు.