టీఆర్ఎస్‌లో ఎంపీ కేశ‌వ‌రావు ప్లేస్ ఏంటి? మార్చి త‌ర్వాత కేకే సీటు ఉంటుందా? ఆయ‌నకి వేరే ప‌ద‌వి ఇస్తారా? లేదా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ్య‌స‌భ ఎంపీగా కేశ‌వ‌రావు ప‌ద‌వీకాలం మార్చితో ముగుస్తోంది. కేశ‌వ‌రావుకు మ‌ళ్లీ ఎంపీ సీటు ఇచ్చి పెద్ద‌ల‌స‌భ‌కు పంపిస్తారా? ఆ ప్లేస్‌లో వేరే వారికి చాన్స్ ఇస్తారా? అనేది ఇప్పుడు గులాబీ ద‌ళంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కేశ‌వ‌రావు ఇటీవ‌ల ఆర్టీసీ స‌మ్మెవిష‌యంలో కామెంట్స్ చేశారు. సీఎం కోరితే మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌లు చేశారు. దీంతో కేకే బీజేపీ ట‌చ్‌లోకి వెళ్లార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న సీఎం కేసీఆర్‌ను క‌లిసిన త‌ర్వాత అంతా స‌ర్దుకుంది. అయితే కేకే మాత్రం అసంతృప్తిగా ఉన్నార‌ని అప్పట్లో ప్ర‌చారం జ‌రిగింది. తాను కోరుకున్న ప‌ద‌వి రావడం లేద‌ని ఆయ‌న అల‌క వ‌హించార‌ట‌.

అసెంబ్లీ ఎన్నిక‌ల టైమ్‌లో కేకే ఎమ్మెల్యే సీటు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. హైద‌రాబాద్‌లో ఏదైనా సేఫ్ సీటు నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత స్పీక‌ర్ కావాల‌ని ఆయ‌న క‌ల‌లు క‌న్నారు. కానీ కేసీఆర్ మాత్రం సిట్టింగ్‌ల‌కు సీట్లు అంటూ అందరినీ ప‌క్క‌న‌పెట్టారు. దీంతో కేకే స్పీక‌ర్ క‌ల నెర‌వేర‌లేదు.

ఎంపీ సీటు మ‌ళ్లీ ఇవ్వ‌కుంటే కేకేకే ఏ ప‌ద‌వి ఇస్తార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌. కేకే ప్లేస్‌లో క‌విత రాజ్య‌స‌భ‌కు వెళ‌తారు అనే ప్ర‌చారం న‌డుస్తోంది. ఆమె చాలాకాలంగా పొలిటిక‌ల్ సైలెంట్‌గా ఉంటున్నారు. నిజామాబాద్‌లో ఓడిన త‌ర్వాత అస‌లు ఆమె కనిపించ‌డం లేదు. లో ప్రొపైల్ లో ఉంటున్నారు. త‌న‌కు ప‌ద‌వి ఇస్తే బ‌య‌ట‌కు రావ‌చ్చు అని ఆమె అనుకుంటున్నారు. రాజ్య‌స‌భ‌లో రేసులో ఉన్న మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చారు. దీంతో రాజ్య‌స‌భ‌కు క‌విత‌కు లైన్ క్లియ‌ర్ అయింద‌ని గులాబీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

కేకే రీప్లేస్‌మెంట్‌లో భాగంగా ఎమ్మెల్సీ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని తెలుస్తోంది. కేబినెట్‌లోకి తీసుకోక‌పోతే శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ఇస్తార‌ని… గుత్తాను కేబినెట్‌లోకి తీసుకుంటార‌నేది మ‌రో వెర్ష‌న్. మొత్తానికి కేకే రాజ్య‌స‌భ‌కు పంపే వీలు లేద‌ని స‌మాచారం.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.