పాఠ్యాంశంగా ట్రిపుల్ తలాక్‌

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 Sept 2019 7:55 PM IST

పాఠ్యాంశంగా ట్రిపుల్ తలాక్‌

లక్నో: ట్రిపుల్ తలాక్‌పై ఎంత రచ్చ జరిగిందో దేశం మొత్తానికి తెలిసిందే. అయితే..మోదీ ప్రభుత్వం అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసింది. ఇప్పుడు ఇది విద్యార్దులకు పాఠ్యాంశంగా మారింది. యూపీలోని బరేలిలో ఉన్నమహాత్మా జ్యోతిబా ఫులే రోహిల్ ఖండ్ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు. వర్శిటీ లా డిపార్ట్‌మెంట్ అధిపతి అమిత్ సింగ్ ఈ మేరకు మీడియాకు వివరించారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎం కోర్సుల్లో ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ చట్టానికి (2019) సంబంధించిన సిలబస్‌ను చేర్చినట్టు ఆయన తెలిపారు. పాత సిలబస్‌ స్థానంలో దీనిని ప్రవేశపెట్టినట్లు అమిత్ సింగ్ చెప్పారు.

ఈ సిలబస్ కేస్ స్టడీస్‌కు కూడా ఉపకరిస్తుందని, దీని ద్వారా విద్యార్థులు మంచి లాయర్లుగా తయారవుతారని అమిత్ సింగ్ అభిప్రాయపడ్డారు. తమ విద్యార్థుల్లో ఒకరు ట్రిపుల్ తలాక్‌పై డాక్టరేట్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. కొత్త సిలబస్‌ పట్ల తామెంతో ఆసక్తిగా ఉన్నట్టు పలువురు విద్యార్థులు కూడా చెప్పడం విశేషం. యూనివర్శిటీ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Next Story