మినీ బస్సును ఢీకొన్న రైలు.. 20 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 3 July 2020 7:35 PM ISTపాకిస్థాన్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ ఫ్రావిన్స్‌లోని షేక్‌పురా రైల్వే క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది సిక్కులే ఉన్నారు. వీరంతా యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 27 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పాక్ ప్రధాని తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సిక్కుయాత్రికులు నంకానా సాహెబ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో పాకిస్తాన్ లో పలు ప్రార్థనా మందిరాలు తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్‌లోని తమ పవిత్ర స్థలం నంకానా సాహెబ్‌ను దర్శించేందుకు సిక్కులు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో జరిగిన ప్రమాదంలో సిక్కు యాత్రికులు మృతి చెందిన విషాదకర ఘటన వేదనకు గురిచేసింది. వారి కుటుంబాలు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులైన యాత్రికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.