తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలిస్తూ ఉన్నారు అధికారులు. నిరాశ్రయులకు సహాయం అందించడానికి పలు బృందాలు రంగం లోకి దిగాయి. ఈ వరదలకు సంబంధించిన చాలా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. వాటిలో ఓ వీడియో అందరినీ షాక్ కు గురిచేస్తోంది. వరద నీటి ఉధృతికి ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ హైదరాబాద్ లో కొట్టుకుని పోయిందని వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.

ట్విట్టర్ యూజర్ “HISTORY MADE I SUPPOSE 😄 TRAFFIC SIGNAL CROSSING THE ROAD.” అంటూ వీడియోను పోస్టు చేశాడు. అతను తన వీడియోకు #HyderabadRains, #Telangana, #TelanganaRains ట్యాగ్స్ జత చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది అన్నట్లుగా అతడు.. పోస్టు చేశాడు.
న్యూస్ మీటర్ జర్నలిస్టు Coreena Saures ను ట్యాగ్ చేసి.. అది నిజమో కాదో తెలియజేయాలని కోరారు.
నిజ నిర్ధారణ:
ఈ వీడియో హైదరాబాద్ కు చెందినది కాదు.
దీనిపై న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియోకు సంబంధించిన నిడివి గల వీడియో లభించింది. చైనీస్ న్యూస్ నెట్వర్క్ సంస్థ అయిన CGTN ఈ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ కొట్టుకుపోవడాన్ని స్పష్టంగా గమనించవచ్చు. చైనాలోని యులిన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గువాంగ్జి జువాంగ్ అటానమస్ రీజన్ లో చోటు చేసుకుంది. 2018 సంవత్సరంలో మే నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో భారీ వరదలు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. భారీగా ఆస్థి నష్టం చోటు చేసుకుంది.
ఇక వీడియోలో బ్యాగ్రౌండ్ లో ఉన్న షాపులకు సంబంధించిన సిగ్నల్స్, స్టిక్కర్లను పరిశీలిస్తే మాండరిన్ భాషలో ఉన్నాయి. టూ వీలర్లకు ఉన్న నెంబర్ ప్లేట్స్ ద్వారా కూడా అవి తెలంగాణకు చెందిన నెంబర్ ప్లేట్స్ కాదని తెలుస్తోంది.

ఈ వీడియో మీద గతంలో చాలా పోస్టులు ప్రచారం లోకి రాగా.. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుందని చాలా మీడియా సంస్థలు నిజ నిర్ధారణ ద్వారా తేల్చాయి.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ట్రాఫిక్ సిగ్నల్ కొట్టుకుపోయిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.