Zero Shadow day: ఇవాళ నీడ మాయం అవుతుంది.! మీకు తెలుసా?
గురువారం మిట్టమధ్యాహ్నం సమయంలో మన నీడ మాయం కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 9 May 2024 4:12 AM GMTZero Shadow day: ఇవాళ నీడ మాయం అవుతుంది.! మీకు తెలుసా?
మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా.. ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉండేది.. అదే మన నీడ అండి. కూర్చున్నా.. నిల్చున్నా.. పడుకుని ఉన్నా వెన్నంటే ఉంటుంది. ఇక పిల్లలు అయితే.. నీడతో అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. అయితే.. ఎప్పుడూ మనతోనే ఉన్న నీడ కొన్ని సందర్భాల్లో కనిపించదు. మాయం అవుతుంది అంటే నమ్ముతారా? అవును ఇది నిజమే. చాలా మంది ఇప్పటికే దీని గురించి వినే ఉంటారు. అదే జీరో షాడో డే. ఆ అరుదైన సంఘటన ఇవాళ హైదరాబాద్‌లో జరగబోతుంది. గురువారం మిట్టమధ్యాహ్నం సమయంలో మన నీడ మాయం కాబోతుంది.
ఈ జీరో షాడో డే ఏడాదికి రెండుసార్లు జరుగుతుందట. జీరో షాడో డే అంటే సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే నిటారుగా ఉండే మనిషి, వస్తువు, లేదా ఇతరా ఏవైనా నీడ కనిపించదు. హైదరాబాద్‌లో జీరో షాడో డే మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభం అవుతుంది. రెండు, మూడు నిమిషాల వరకు ఈ జీరో షాడో డే కొనసాగుతోంది. ఈ విషయాన్ని బీఎం బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడించారు. అయితే.. జీరో షాడో డే కోసం.. తమ నీడ మాయం అయ్యే దృశ్యాన్ని చూసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్నట్లుండి వర్షాలు పడుతున్నాయి. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే ఆత్రం శూన్యనీడ కనిపించే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఎవరైనా ఔత్సాహికులు జీరో షాడో డే సందర్భంగా తమ నీడ లేకుండా తీసుకున్న ఫొటోలను పంపాలనుకుంటే birlasc@gmail.com కు పంపించాలని సూచించారు.