మునుగోడుపై టీఆర్ఎస్ నజర్.. భారీ బహిరంగ సభకు ముహూర్తం ఫిక్స్..!
TRS Party focus on Munugode bypoll.తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు రాజకీయం వేడి ఎక్కింది. ఎమ్మెల్యే పదవికి కోమటి రెడ్డి
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2022 8:23 AM ISTతెలంగాణ రాష్ట్రంలో మునుగోడు రాజకీయం వేడి ఎక్కింది. ఎమ్మెల్యే పదవికి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి ప్రజలు తమ వైపే ఉన్నారని చాటి చెప్పాలని రాజకీయ పార్టీలు బావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాదయాత్రతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం కాగా.. బీజేపీ కూడా భారీ సభతో రంగంలోకి దిగాలని బావిస్తోంది. ప్రధాన పార్టీలు అన్ని ప్రచారానికి సిద్దం అవుతుండడంతో అధికార టీఆర్ఎస్ అప్రమత్తమైంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో టీఆర్ఎస్ మునుగోడులో విజయం సాధించింది. అయితే.. 2018లో ఈ సీటు కాంగ్రెస్ హస్తగతమైంది. ఇప్పుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మరోసారి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిగే పరిస్థితి లేదని, అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నికకు అవకాశం ఉండొచ్చునని టీఆర్ఎస్ బావిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి పకడ్భందీగా ఉప ఎన్నికకు సమాయత్తమవుతోంది.
స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో గురువారం సమావేశం అయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోకుండా, అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న సంస్థాన్ నారాయణపూర్‌లో 'ప్రజాదీవెన' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారానికి తెర లేపాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
బజ్జగింపులు, ఆహ్వానాలు..
గ్రామాలు, మండలాలను ప్రభావితం చేయగల నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ బీజేపీలోకి చేరుతున్నా.. ఆయన వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపని వారికి గులాబీ గాలం వేస్తోంది. పార్టీలో కొందరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించి వారిని హైదరాబాద్ పిలిపించి బుజ్జగించాలని ప్రయత్నిస్తోంది. మండలాల స్థాయి నుంచి పార్టీని అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు పార్టీ పరిస్థితిని చక్కబెట్టే బాధ్యతలను అప్పగించారు.
మునుగోడు టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. అధిష్టానం ఇప్పటి వరకు ఎవ్వరిని అభ్యర్థిగా నిర్ణయించలేదు. అన్ని అంశాలు, స్థానికంగా పార్టీని బలోపేతం చేసిన తరువాతనే అభ్యర్థిని ప్రకటించాలని టీఆర్ఎస్ బావిస్తోంది.
కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దు..!
2014లో మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే.. 2018లో ఓటమి పాలైయ్యారు. ఈ సారి కూడా టీఆర్ఎస్ తరుపున ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. అయితే.. పార్టీ శ్రేణులు ప్రభాకర్ రెడ్డి అభ్యర్థితాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పార్టీ శ్రేణులకు ఏ మాత్రం అందుబాటులో ఉండని వ్యక్తికి అవకాశం ఇవ్వొద్దని వారంతా మంత్రి జగదీశ్ రెడ్డికి మొరపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సొంత పార్టీ నాయకులపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇస్తే పనిచేయబోమని చెప్పారు. 2018లో ప్రభాకర్ రెడ్డి ఓటమికి ఇదే కారణమని, ఇప్పుడు మళ్లీ టికెట్ ఇస్తే పరాజయం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రత్యేక సందర్భంలో ఉప ఎన్నిక జరగనుంది కాబట్టి ఏ మాత్రం ఛాన్స్ తీసుకునే వీలులేదని, సీఎం కేసీఆర్ ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే ఆయన విజయం కోసం పార్టీ శ్రేణులంతా పని చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు శ్రేణులకు సూచించినట్లుగా తెలుస్తోంది.
మరో ఏడాదిలో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు మునుగోడును దక్కించుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 'పాజిటివ్ వేవ్స్'పంపాలన్న కృతనిశ్చయంతో టీఆర్ఎస్ ఉంది.