యుద్ధ ప్రభావం మన జేబు మీద ఎంత భారం కాబోతోంది…
By - Nellutla Kavitha | Published on 18 March 2022 8:20 AM GMTరష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై అప్పుడే మూడు వారాలు గడిచిపోయింది. దీంతోపాటే వివిధ దేశాల మీద ప్రభావం కనిపించడం మొదలైంది. వంట నూనెలు, ముడిచమురు మొదలు బంగారం, వెండి, ఇతర మెటల్స్ భారంగా మారాయి. ఉక్రెయిన్ నుంచి ముడి పదార్థాలు ఎగుమతులు జరగకపోవడం, అమెరికా సహా ఇతర దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించడం దీనికి కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు చైనాలో మొదలైనటువంటి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య కూడా పరోక్షంగా ఎగుమతుల మీద ప్రభావాన్ని చూపిస్తోంది. దీనికితోడు వార్తాపత్రికలకు కావలసినటువంటి ప్రధాన ముడిసరుకు అయిన న్యూస్ ప్రింట్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వల్ల మన జేబు మీద ఎటువంటి భారం పడుతోంది? ఏ వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి? ఇప్పుడు చూద్దాం.
ప్రపంచానికి కావాల్సిన వంటనూనెలలో అత్యధికంగా రష్యా, ఉక్రెయిన్ నుంచే ఎగుమతులు ఉంటాయి. భారతదేశానికి సంబంధించి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఉక్రెయిన్ నుంచి 70 శాతం వరకు జరుగుతుంటాయి. గ్లోబల్ మార్కెట్లో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అయిన వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు ఆహారధాన్యాల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడబోతోంది. ఉక్రెయిన్ ను breadbasket ఆఫ్ యూరప్ గా పిలుస్తుంటారు. ఈ రెండు దేశాల నుంచే గ్లోబల్ మార్కెట్ కు 29 శాతం మేర ఆహారధాన్యాలు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధంతో ఒకవైపు ఎగుమతులు ఆగిపోవడంతో పాటుగా, మరోవైపు రష్యన్ దళాలు బాంబుల్ని పంట పొలాల మీద కురిపించడంతో, ఒకవైపు పంటలు ధ్వంసమయ్యాయి మరోవైపు పరికరాలు కూడా పనికి రాకుండా పోయాయి. ఉక్రెయిన్ నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతులు జరిగేవి, అయితే ప్రస్తుత యుద్ధం వల్ల పోర్ట్స్, ల్యాండ్ రూట్స్ అలాగే, కార్గో విమానాల మీద కూడా ప్రభావం చూపించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్ కు వంద డాలర్లకు పైగా పలకడంతో ప్రస్తుతం ముడి చమురు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పెట్రోలు, డీజిల్, పెట్రో కెమికల్ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా వల్ల రెండేళ్లుగా విమానయాన అవకాశం లేకుండా పోయింది. కోవిడ్ ఆంక్షలు సడలించిన ప్పటికీ, ఈ యుద్ధం వల్ల పెరుగుతున్న ధరలతో విమాన టికెట్లు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రేర్ మెటల్స్ అయినటువంటి నికెల్, ప్లాటినం తో పాటుగా బంగారం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో ఒక టన్ను నికెల్ ధర లక్ష డాలర్లకు పైగా నే పలుకుతోంది.
ఇక యుద్ధం తొందరగా ముగియకుంటే వార్తా పత్రికల మీద కూడా ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే విదేశీ మారకం విలువల్లో తేడాలు వస్తున్నందున ఆ ప్రభావం భవిష్యత్తులో న్యూస్ ప్రింట్ మీద కూడా చూపించే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా నుంచి 45 శాతం మేర న్యూస్ ప్రింట్స్ దిగుమతులు భారతదేశానికి వస్తుంటాయి. కరోనా వల్ల రెండేళ్లుగా గ్లోబల్ సప్లై చైన్స్ మీద ఎఫెక్ట్ కనిపించింది. న్యూస్ ప్రింట్ ఆర్డర్స్ ని ఇప్పటికే షిప్పింగ్ చేయించుకున్న వారి మీద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ, యుద్ధం మరికొంతకాలం కంటిన్యూ అవుతే, భవిష్యత్తులో జరగాల్సిన న్యూస్ ప్రింట్ షిప్పింగ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. న్యూస్ పేపర్ ప్రింటింగ్ లో న్యూస్ ప్రింట్ కే దాదాపుగా 40 నుంచి 50 శాతం వెచ్చించాల్సిన ఉంటుంది. విదేశాల నుంచి కాకుండా మన దేశంలో తయారుచేసే దేశీయ న్యూస్ ప్రింట్ మేకర్లు ఈ కామర్స్ బిజినెస్ కోసం ప్యాకేజింగ్ మెటీరియల్ను తయారుచేసే పనిలో బిజీ అయిపోయారు. ఇది కూడా న్యూస్ ప్రింట్ మీద ప్రభావం చూపిస్తుందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే న్యూస్ ప్రింట్ ధరలు ఏ మేర పెరుగుతాయి, ఎప్పుడు పెరుగుతాయి, అనేది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిమీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు.