అమెరికాలో మెదక్ జిల్లాకు చెందిన యువకుడు మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి తన కలలు నెరవేరకముందే కన్నుమూశాడు.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 9:03 AM ISTఅమెరికాలో మెదక్ జిల్లాకు చెందిన యువకుడు మృతి
అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం కష్టమే అయినా సరే అక్కడికి వెళ్లి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని భావిస్తారు. అలానే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి తన కలలు నెరవేరకముందే కన్నుమూశాడు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ ప్రాంతానికి చెందిన గడ్డం వినీత్ ఉన్న చదువుల కోసం న్యూయార్క్‌కు వెళ్లాడు. ఈ నెల 18న న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తూ వినీత్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దాంతో అక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కాసేపటికే అక్కడికి చేరుకున్నారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే వినీత్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత వినీత్ మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు.
కాగా.. కొన్ని రోజులుగా వినీత్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఇండియాలో ఉన్న అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాంతో.. ఏం జరిగిందో తెలుసుకోవాలని వినీత్ స్నేహితుడిని కోరారు. తమిళనాడుకు చెందిన పళని అమెరికాలోనే ఉంటున్నాడు. వినీత్‌కు అతడు స్నేహితుడు. తల్లిదండ్రుల కోరిక మేరకు వినీత్‌కు ఏం జరిగిందనే దానిపై ఆరా తీశాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు. దాంతో.. వినీత్ చనిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన భారత్‌కు చెందిన ఓ యువకుడి డెడ్‌బాడీ మార్చురీలో ఉందని తెలపడంతో పళని వెళ్లి చూశాడు. మృతదేహం వినీత్‌దే అని గుర్తించారు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.
కొడుకు మరణవార్త విన్న వినీత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వినీత్ తండ్రి బాలేశ్ మనోహరాబాద్ ప్రాంతానికి చెందినవారు. బోయినపల్లిలోని హనుమాజీ కాలనీలో నివాసముంటున్నారు. తండ్రి క్యాబ్ డ్రైవర్ కాగా, తల్లి ఓ దుకాణంలో రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పులు చేసి మరీ కొడుకుని అమెరికా పంపిస్తే ఇలా జరిగిందని వాపోతున్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు వినీత్ మృతదేహాన్ని మిళనాడు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ వారు ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేశారు.