గణేష్ శోభాయాత్రలో డ్యూటీలో ఉన్న పోలీసుల స్టెప్పులు..వీడియో చూశారా!
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణపతి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు విగ్రహాలను తీసుకొస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 4:08 PM ISTగణేష్ శోభాయాత్రలో డ్యూటీలో ఉన్న పోలీసుల స్టెప్పులు..వీడియో చూశారా!
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో గణపతి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు విగ్రహాలను తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లోని నలుమూలల నుంచి వేలాదిగా గణేశుని విగ్రహాలను పూజల తర్వాత నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని రోడ్లలో దారి పొడవునా గణపతి విగ్రహాలే కనిపిస్తున్నాయి. భక్తులు ఆట, పాటలు.. యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేష్ మహారాజ్’ నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై ఎక్కడ చూసినా జనంతో నిండిపోయింది. ఖైరతాబాద్ గణేష్ ఎదుట భక్తులతో పాటు పోలీసులు కూడా తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గణేష్ శోభాయాత్ర అంటే హైదరాబాద్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ట్యాంక్ పరిసర ప్రాంతమంతా ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. కొన్ని కిలోమేటర్ల మేర విగ్రహాలు క్యూలో నిలబడతాయి. ఇంతమంది జనం ఉంటే భద్రతా కోసం పోలీసులు కూడా భారీ సంఖ్యలో ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో గణేశ్ శోభాయాత్రలో ఎలాంటి అవాంచనీయ సంఘనటలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. యాత్ర పొడవునా సెక్యూరిటీగా నిలబడ్డారు. అయితే.. శోభాయాత్ర సందర్భంగా గణేశ్ విగ్రహాల వెహికల్స్‌పై సౌండ్ బాక్సులు, బ్యాండ్‌లు మోగిస్తారు. బందోబస్తులో పాల్గొన్న ఓ కానిస్టేబుల్ పాటలకు స్టెప్పులేశాడు. ఓ వైపు డ్యూటీ చేస్తూనే అదిరిపోయే స్టెప్పులతో అందరినీ అలరించాడు. కొన్ని స్టెప్పులు మైఖేల్ జాక్సన్‌లా కనిపిస్తే.. ఇంకొన్ని అయితే ఈలలు వేసేలా ఉన్నాయి. అతడి డ్యాన్స్ చూసిన స్థానిక జనం ఫిదా అయిపోయారు. అయితే.. అతను డివైడర్‌పైనే నిల్చొని డ్యాన్స్ చేశాడు. ఇక నేలపై.. లేదంటే మంచి స్టేజ్‌పై అయితే ఇంకెలాంటి స్టెప్స్ వేసేవాడో అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇతడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరికొందరు పోలీసు అధికారులు కూడా గణేష్ శోభాయాత్రలో భక్తులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. భద్రతా చర్యల్లో నిమగ్నం అయ్యే పోలీసులు.. డ్యూటీ చేస్తూనే అందరితోపాటు స్టెప్పులు వేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో గణేశ్ శోభాయాత్రబొజ్జ గణపయ్యలతో సందడిగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు శోభాయాత్రలో పాటలకు భక్తులతో పాటు స్టెప్పులు వేసిన పోలీసులు pic.twitter.com/LB3mMhwnoM
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 28, 2023
కాగా.. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యింది. వేలాది మంది భక్తుల నినాదాల మధ్య బడా గణేష్ గంగమ్మ ఒడికి చేరారు. ఆ తర్వాత మిగిలిన గణనాథుల నిమజ్జనాల కార్యక్రమం కొనసాగుతోంది. గణనాథుడి నామస్మరణతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. ఇక శుక్రవారం వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది.