తెలంగాణ హైకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకి మరోసారి చుక్కెదురు
వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
By Srikanth Gundamalla
తెలంగాణ హైకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకి మరోసారి చుక్కెదురు
కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నికపై ఇటీవల తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆయన ఎన్నికల సమయంలో అఫిడవిట్‌లో తప్పుడు పత్రాలు సమర్పించారని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ వనమా వెంకటేశ్వరరావు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో.. మరోసారి వనమాకు హైకోర్టులో చుక్కెదురైంది.
ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని వనమా వెంకటేశ్వరరావు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. తాను తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు అప్పీల్‌కు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకోసం హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధించాలని వనమా వెంకటేశ్వరరావు కోరారు. మధ్యంతర పిటిషన్‌పై విచారించిన హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. వనమా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు జూలై 25న సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాక వనమాకు రూ.5లక్షల జరిమానా కూడా విధించింది. ఎన్నికలో రెండో అభ్యర్థిగా ఉన్న జలగం వెంకట్రావునే 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.