సీఎం రేవంత్‌ దావోస్‌ టూర్ సక్సెస్, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం దావోస్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  20 Jan 2024 1:44 AM GMT
telangana, cm revanth reddy, davos tour, success,

సీఎం రేవంత్‌ దావోస్‌ టూర్ సక్సెస్, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం దావోస్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ టూర్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి సమావేశాలు సక్సెస్ అయ్యాయి. తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలలించాయి. దాదాపు రూ.40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.

దావోస్‌ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి బృందం మూడ్రోజుల వ్యవధిలో వివిధ కంపెనీలకు చెందిన 200 మంది ప్రతినిధులతో సమావేశం అయ్యింది. తెలంగాణలో రూ. 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకు వచ్చింది. నాలుగు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అదానీ గ్రూప్‌ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్‌ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశాయి. వీటితో పాటు మరికొన్ని సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. దావోస్‌కు రావడం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్‌కు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు.

ఇక మూడ్రోజుల దావోస్‌ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌ చేరుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత థేమ్స్‌ నది అపెక్స్‌ గవర్నింగ్ బాడీ అధికారులతో సమావేశం అయ్యారు. మూసీనది ప్రక్షాళన ఒప్పందంపై చర్చించారు. థేమ్స్ నది నిర్వహణపై అధ్యయనం చేసి మూసీ నది ప్రక్షాళనలో అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం. మూసీ నది ప్రక్షాళనపై పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు అధికారులు.

Next Story