తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు విద్యార్థులు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2024 8:30 AM IST
tamilnadu, road accident, five students, death,

తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు విద్యార్థులు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. రెండ్రోజులు సెలవులు ఉన్నాయని విద్యార్థులు ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇంతలోనే వారిని మృత్యువు కబలించింది. లారీ రూపంలో వచ్చి ఢీకొట్టింది. దాంతో.. ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కాలేజీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన స్నేహితులుగా గుర్తించారు పోలీసులు.

ఏడుగురు స్నేహితులు వీళ్లంతా ఒకే కాలేజీకి చెందిన వారు. చెన్నై సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయల్దేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ఏడుగురు ఉండగా.. ఐదుగురు చనిపోయారు. విద్యార్థులంతా ప్రొద్దుటూరుకు చెందిన గిద్దలూరు నితీష్‌(21), తిరుపతికి చెందిన యుగేశ్‌(23), చేతన్‌(22), కర్నూలుకు చెందిన రామ్మోహన్‌(21), విజయవాడకు చెందిన బన్ను నితీష్‌(22), నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యగా పోలీసులు చెప్పారు.

ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న గిద్దలూరు నితీష్, చేతన్, రామ్మోహన్, యుగేష్, బన్ను నితీష్‌ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు. విష్ణు, చైతన్యకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వెంటనే స్పందించింది వారిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. ఈ సంఘటన విద్యార్థుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది.

Next Story