పెంపుడు కుక్కతో వాకింగ్ - ఐఏఎస్ అధికారి కోసం స్టేడియం ఖాళీ
By - Nellutla Kavitha | Published on 26 May 2022 6:00 PM IST2014 నుంచి భారతదేశ క్రీడాకారులు అన్ని పోటీల్లోనూ బాగా రాణిస్తున్నారు, దీనికి కారణం వారిలో వచ్చినటువంటి అకుంఠితమైన ఆత్మవిశ్వాసం. ఈ మాటలు కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ ఐ ఎస్ బి ద్వి దశాబ్ది వేడుకల్లో వ్యాఖ్యానించారు. సరైన టాలెంటు. దానికి తగ్గట్టుగా వనరులు ఉన్నపుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియంలో మాత్రం అధికారులు, అథ్లెట్ లు ట్రైనర్లను ప్రతిరోజు త్వరగా శిక్షణ ముగించి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనికి కారణమేంటో తెలుసా ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన కుక్క తో కలిసి సాయంత్రం ఆ స్టేడియంలో వాకింగ్ చేయడం కోసమే.
ఢిల్లీలో సంజీవ్ ఖిర్వార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ రెవెన్యూ శాఖలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు తన పెంపుడు కుక్క తో కలిసి స్టేడియంలో వాకింగ్ కోసం వస్తూ ఉండేవారు. అయితే అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు కోచ్ లు ఇబ్బందులు ఎదుర్కోవడంతో తరచుగా ఫిర్యాదులు చేసేవారు క్రీడాకారులు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా త్యాగరాజ్ స్టేడియంలోని అథ్లెట్లు కోచ్ లు సాధారణ సమయం కన్నా ముందుగానే, అంటే సాయంత్రం 7 గంటల లోపు శిక్షణ ముగించుకుని వెళ్ళి పోమని సూచించారు అధికారులు. నిర్ణీత సమయం కంటే ముందుగానే కోచింగ్ ముగించుకుని వెళ్లిపోవడం వల్ల తమ ఆట తీరు మీద ప్రభావం పడుతుందని భావించిన క్రీడాకారులు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ వ్యవహారమంతా మీడియాలో కథనాలు రావడంతో ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. రాత్రి పది గంటల వరకు నగరంలోని అన్ని స్టేడియంలు క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ను ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంపై సదరు ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం తన మీద వస్తున్న ఆరోపణలను ఖండించారు. స్టేడియం మూసేసిన తరవాత మాత్రమే తాను, తన పెంపుడు కుక్క వాకింగ్ కోసం వెళ్తున్నట్టు గా చెప్పారు ఆ అధికారి.