మోదీ మమ్మల్ని ఆదుకోండి
By - Nellutla Kavitha | Published on 4 April 2022 4:38 PM ISTశ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు. ఎమర్జెన్సీ విధించినా, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది.
ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. గంటల తరబడి పెట్రోల్ బంకులు, సరుకుల కోసం షాపుల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. కిలో బియ్యం రెండు వందల ఇరవై రూపాయలు, పాలపొడి 19 వందల రూపాయలు, గుడ్డు ధర ఆకాశాన్ని అంటుతోంది. మరోవైపు శ్రీలంక స్టాక్ ఎక్స్చేంజ్ కూడా భారీగా పతనమైంది. శ్రీలంకలో ఎమర్జెన్సీ పరిస్థితులు విధించినప్పటికీ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుండడంతో 36 గంటల సుదీర్ఘ కర్ఫ్యూ కూడా విధించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మహీంద్ర రాజపక్సే మినహా శ్రీలంక క్యాబినెట్ మంత్రులు అందరూ ఆదివారం అర్ధరాత్రి రాజీనామా చేశారు.
ఇక శ్రీలంక లో నెలకొన్న దారుణమైన ఆర్థిక సంక్షోభం పై మాజీ క్రికెటర్లు స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ అజెండాలను పక్కనపెట్టి, ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహేల జయవర్ధనే, కుమార సంగక్కర, వనిందు హసరంగ, భానుక రాజపక్స, దేశ భవిష్యత్తును రక్షించుకోవడానికి, అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు శ్రీలంకలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభంతో తమ దేశానికి సహాయం చేయాలంటూ శ్రీలంక ప్రతిపక్షనేత సజిత్ ప్రేమదాస భారత ప్రధాని మోడీ కి విజ్ఞప్తి చేశారు. మా మాతృభూమిని రక్షించడానికి మమ్మల్ని ఆదుకోండి అంటూ ప్రతిపక్ష నేత ప్రధాని మోదీని ప్రాధేయపడ్డారు. శ్రీలంక మా మాతృభూమి, మా మాతృభూమిని ఆదుకోండి అంటూ మోదీని వేడుకున్నారు ప్రేమదాస.