ఇవాళ్టి నుంచి శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం మహా క్షేత్రంలో ఇవాళ్టి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 11 Jan 2025 6:29 AM IST
ఇవాళ్టి నుంచి శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం మహా క్షేత్రంలో ఇవాళ్టి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయి. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు ఉంటాయి. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశస్థాపన, వేదపారాయణాలుతో పాటు ప్రత్యేక పూజాధికాలు ఉంటాయి. మకర సంక్రమణం రోజున గాంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం ఆలయ సాంప్రదాయం ప్రకారం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల చివరి రోజున పుష్పోత్సవసేవ, శయనోత్సవ సేవ ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. శ్రీశైల క్షేత్రంలో జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి అమ్మవార్ల ఆర్జిత, పరోక్ష సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఈవో ప్రకటించారు.
మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సంస్కృతీ సాంప్రదాయాలను అనుసరిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో 13వ తేదీన భోగి పర్వదినాన ఉదయం 10 గంటలకు అక్కమహాదేవి అలంకార మండపంలో ఐదు సంవత్సరాల వయసు లోపు చిన్నారులకు ఉచిత సామూహిక భోగిపండ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే విధంగా 14వ తేదీన సంక్రాంతి పండుగ రోజున మహిళలకు ప్రత్యేకంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చెప్పారు.