నెంబర్ ప్లేట్‌కు అంత ధరా..? ఇంకో కారు కొనేయొచ్చు కదా..!
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 1:16 PM ISTనెంబర్ ప్లేట్‌కు అంత ధరా..? ఇంకో కారు కొనేయొచ్చు కదా..!
కొత్త వెహికల్ కొన్నామంటే చాలు.. చాలా మంది నెంబర్ ప్లేట్ మంచి నెంబర్‌తో ఉండాలని అనుకుంటారు. మరికొందరు అయితే.. డబ్బులు పోయినా సరే ఫ్యాన్సీ నెంబర్ కావాలని కోరుకుంటారు. అలా ఫ్యాన్సీ నెంబర్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నవారిని చూస్తుంటాం. దీని ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందనే చెప్పాలి. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆర్టీఏ అధికారులు వేలం నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వేలంలో పాల్గొన్న కస్టమర్లు తమకు నచ్చిన నెంబర్ కోసం లక్షల రూపాయల వరకు పాట పాడి గెలుచుకుంటారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఆర్టీఏలో నిర్వహించిన వేలంలో ఒక ఫ్యాన్సీ నెంబర్ ఏకంగా రూ.10 లక్షలకు అమ్ముడుపోయింది.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు. ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఈ వేలంలో చాలా మంది వాహనాదారులు ఉత్సాహంగా పాల్గొన్నారని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాండు రంగనాయక్ వెల్లడించారు. వేలంలో TS11EZ9999 ఫ్యాన్సీ నెంబర్‌కు ఏకంగా రూ.9,99,999లు పలికిందని అధికారులు చెప్పారు. ఈ నెంబర్‌ను అధిక ధరకు ఎడ్యుకేషనల్ సొసైటీ కొనుగోలు చేసినట్లు కమిషనర్ పాండు రంగనాయక్ తెలిపారు. అలాగే టీఎస్ 11 ఎఫ్‌ఏ 0001 ఫ్యాన్సీ నెంబర్‌కు రూ.3లక్షల ఆదాయం వచ్చింది. దీన్ని కామినేని సాయి శివనాగ్ దక్కించుకున్నారని తెలిపారు. ఇక టీఎస్ 11 ఎఫ్‌ఏ 0011 ఫ్యాన్సీ నెంబర్‌ను రూ.1.55 లక్షలకు సాయి రోహిత్‌రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారని పాండురంగ నాయక్ తెలిపారు. ఇక ఈ వేలంలో మొత్తం రూ.18,02,970 ఆదాయం ఆర్టీఏకు వచ్చింది అధికారులు వెల్లడించారు. ఇలా పెద్ద మొత్తంలో ఫ్యాన్సీ నెంబర్లను వేలంలో పెట్టి ఆదాయాన్ని గడిస్తున్నారు అధికారులు. ఇక 9999 నెంబర్‌ను రూ.10లక్షలకు దక్కించుకున్న వార్త తెలిసిన వారు అంత అమౌంట్‌తో ఇంకో కారే కొనేయచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.