చీటింగ్, డిజిటల్ మోసాల ద్వారా 10.61 కోట్లు సంపాదించారు.. చివరికి!!

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రత్యేక బృందం చీటింగ్, డిజిటల్ మోసాల ద్వారా 10. 61 కోట్ల రూపాయలను కూడబెట్టిన బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.

By Kalasani Durgapraveen  Published on  8 Oct 2024 8:01 PM IST
చీటింగ్, డిజిటల్ మోసాల ద్వారా 10.61 కోట్లు సంపాదించారు.. చివరికి!!

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రత్యేక బృందం చీటింగ్, డిజిటల్ మోసాల ద్వారా 10. 61 కోట్ల రూపాయలను కూడబెట్టిన బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. టీజీసీఎస్‌బీ బృందం నిందితులను బెంగళూరులోని వారి రహస్య స్థావరాలలో పట్టుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. ఈ మోసాలకు సంబంధించి హైదరాబాద్ అధికారులకు సమాచారం రావడంతో అప్రమత్తమైన టీజీసీఎస్‌బీ బృందం చర్యలు చేపట్టింది. నిందితులు తమను ముంబై పోలీసులుగా పేర్కొంటూ బాధితులను సంప్రదించి మోసాలకు పాల్పడ్డారు.

ఓ బాధితురాలి ఆధార్, పాన్ ఉపయోగించి బ్యాంకు ఖాతా తెరిచారని, అది PMLA (మనీలాండరింగ్) కార్యకలాపాల కింద మోసాలు చేశారంటూ బెదిరింపులకు దిగారు. బాధితురాలికి మోసగాళ్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆదాయపు పన్ను శాఖ నుండి నకిలీ లేఖలు కూడా పంపారు. ఆస్తులు, డిపాజిట్లు, షేర్లు, జీతం, లాంటి ఆర్థిక వివరాలను కాజేశారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వాళ్లను బెంగళూరులోని హులిమావుకు చెందిన వినయ్ కుమార్ (23), కర్ణాటక కు చెందిన మారుతి (28)గా గుర్తించారు.

విచారణలో నిందితులు M/S Tinkan Technologies Pvt. Ltd. కంపెనీ కింద కరెంట్ ఖాతా జాయింట్ అకౌంట్ హోల్డర్లమని ఒప్పుకున్నారు. బాధితురాలి ఖాతా నుంచి ఈ అకౌంట్ కు రూ.4.62 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నేరం చేసేందుకు ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story