రేపటిలోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించండి - రాజ్ థాకరే
By - Nellutla Kavitha | Published on 2 May 2022 10:50 AM GMTలౌడ్ స్పీకర్ల విషయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలను ఇస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే పరిమితులకు మించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 54వేల లౌడ్ స్పీకర్లను ఉత్తర ప్రదేశ్ గవర్నమెంట్ తొలగించింది. దీంతోపాటు 60 వేల లౌడ్ స్పీకర్ల సౌండ్ కూడా తగ్గించగలిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రార్థనాలయాలు ఒకటికి మించి లౌడ్ స్పీకర్లను వాడడానికి వీలులేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు స్థానికుల సహకారంతో ఎలాంటి వైలెన్స్ లేకుండానే లౌడ్ స్పీకర్లను తొలగిస్తున్నారు. ఒకవేళ ప్రార్థనాలయం పెద్దదైతే రెండవ లౌడ్ స్పీకర్ పెట్టుకోవడానికి కలెక్టర్ అనుమతి తప్పనిసరి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రార్థనాలయాల్లో ఇదే విధానం అమలు అవుతుందని, పోలీసులు స్థానికుల సహకారంతో పకడ్బందీగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2017 లోనే అలహాబాద్ హైకోర్టు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకున్న వివరించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. పరిమితికి మించి వాడుతున్న లౌడ్ స్పీకర్ల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటుగా ర్యాలీలు, పెళ్ళిళ్ళలో వాడుతున్న సౌండ్ సిస్టంలు, లౌడ్ స్పీకర్ లపై కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అప్పటి సూచనలను కూడా ఇప్పుడు అమలు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.
మరోవైపు మహారాష్ట్రలో కూడా లౌడ్ స్పీకర్ల వివాదం తీవ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మసీదుల్లో పరిమితులకు మించి వాడుతున్న లౌడ్ స్పీకర్ లను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే అక్కడి మసీదుల్లో అజాన్ కు బదులుగా హనుమాన్ చాలీసా వినిపిస్తుందని హెచ్చరించారు రాజ్ థాకరే.