హైదరాబాద్ లో చల్లబడ్డ వాతావరణం
By - Nellutla Kavitha |
హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మండిపోతున్న ఎండల నుంచి కాస్త నగరవాసులకు ఉపశమనం కలిగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు విపరీతమైన ఎండతో పాటుగా, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు వరుణుడు కాస్త కనికరించాడు. ఏసీలు, కూలర్లు ఎన్ని ఉన్నా, హైస్పీడ్ లో ఫ్యాన్లు నడిచినా ఏమాత్రం లాభం లేకపోతున్న సమయంలో, వరుణుడు హైదరాబాదును కాస్త పలకరించాడు. నగరంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న వాతావరణ మార్పులతో హైదరాబాద్ అంతా చల్లబడింది.
ఈదురుగాలులతో పాటుగా ఉరుములు, మెరుపులతో వచ్చిన తేలికపాటి వర్షంతో నగరవాసి ఊపిరి పీల్చుకున్నాడు. ఖైరతాబాద్,అమీర్పేట్, ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్ తో పాటుగా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మలక్పేట్ లో చెట్లు విరిగిపడితే, షామీర్పేట్ లో వడగళ్ల వాన కురిసింది. భగభగ మండిపోతున్న సూర్యుడితో, ఉక్కపోతతో అల్లాడుతున్న నగర వాసులకు కాస్త ఉపశమనం కలిగించాడు వరుణుడు. మరో రెండు రోజుల పాటు వర్ష సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.