బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్ట్ - 4 రోజుల పోలీస్ కస్టడీ

By -  Nellutla Kavitha |  Published on  11 April 2022 2:31 PM GMT
బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్ట్ - 4 రోజుల పోలీస్ కస్టడీ

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్, అనిల్ ను నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్ట్. సంచలనం కలిగించిన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో మేనేజర్ అనిల్ కుమార్, ఓనర్ వుప్పాల అభిషేక్ లు వేసిన బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. నిందితులిద్దరినీ నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్ట్.

రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో దొరికిన డ్రగ్స్‌ వ్యవహారంలో వీరికి ఉన్నసంబంధాలపై పోలీసులు విచారణలో తేల్చనున్నారు. నియమాల ఉల్లంఘనలతో పాటుగా, మాదకద్రవ్యం కొకైన్ కూడా ఈ పబ్ లో లభ్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే లైసెన్సులను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మూలాలను ఛేదించే పనిలో పడింది. అందులో భాగంగా ఈనెల 14 నుంచి 18 వరకు నిందితులిద్దరినీ పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. ఈ ఇద్దరు నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.

ఈ డ్రగ్స్ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది వాడుతున్నారు, డ్రగ్స్ సప్లై విషయంలో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి అండదండలు, ఎవరెవరు సహకరిస్తుఉన్నారు అనేది పోలీసుల విచారణలో తేలుతుందని భావిస్తున్నారు. ఈనెల 14న నిందితులను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించనున్నారు.

Next Story