పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ, విశేషాలివే..

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటకు పయనం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  21 Aug 2024 10:21 AM IST
prime minister, modi, Poland, Ukraine, tour,

 పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ, విశేషాలివే.. 

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటకు పయనం అయ్యారు. ఇవాళ నరేంద్ర మోదీ వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. పోలాండ్‌, ఉక్రెయిన్‌ దేశాల పర్యటనకు పయనమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన భారత్, పోలాండ్ మధ్య దౌత్య సంబంధాల స్థాపన 70వ వార్షికోత్సవంతో సమానంగా ఉంటుంది. కాగా.. చివరి సారి 1979లో భారత ప్రధాని గా మొరార్జీ దేశాయ్ పోలాండ్‌ను సందర్శించారు.

పోలాండ్‌, ఉక్రెయిన్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సెంట్రల్ యూరప్‌లో పోలాండ్‌ కీలకమైన ఆర్థిక భాగస్వామి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఇది రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని ఆయన చెప్పారు. పోలాండ్ ప్ర‌ధాని డోనాల్డ్ ట‌స్క్‌, అధ్య‌క్షుడు ఆండ్రేజ్ దుడాతో భేటీకానున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. పోలాండ్‌లో ఉన్న భార‌తీయ క‌మ్యూనిటీని క‌ల‌వ‌నున్న‌ట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు.

ఇక పోలాండ్‌ పర్యటన తర్వాత ఉక్రెయిన్‌కు వెళ్ల‌నున్న‌ట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేర‌కు ఉక్రెయిన్ వెళ్తున్న‌ట్లు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.ఉక్రెయిన్‌లో త్వ‌ర‌గా శాంతి, స్థిర‌త్వం రావాల‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. కాగా.. ఉక్రెయిన్, రష్యా మధ్య రెండేళ్ల నుంచి యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన ఆసక్తికరంగా మారింది.

Next Story