మోదీ నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి: పవన్ కళ్యాణ్
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించింది.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 3:25 PM GMTమోదీ నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి: పవన్ కళ్యాణ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దాంతో.. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు జనసేప పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. మోదీ పక్కనే కూర్చున్నారు. ప్రస్తుతం మోదీ, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ సభ వేదికగా ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఉగ్రదాడులు నియంత్రించగలిగారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోదీ ధైర్యం నింపారని చెప్పారు. దేశంలో ఉన్న అత్యధిక జనాభా బీసీలే అన్నారు. మోదీ ప్రభుత్వం బీసీలను నోటితో చెప్పి ప్రేమించలేదనీ.. సీట్లు కేటాయించి ప్రేమించిందని చెప్పారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ప్రేమించిందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారని అన్నారు. ఆయనెప్పుడూ ఎన్నికల కోసమ పనిచేయరన్నారు. అలా చేసివుంటే ఆర్టికల్ 370, నోట్ల రద్దు చేసేవారు కాదన్నారు. మోదీ నాయత్వంలో బీసీల తెలంగాణ రావాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
తనలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ అనీ.. ఆయన మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోదీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన మంత్రికి తాన అండగా ఉంటానన్నారు. తమ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్ కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు చెప్పారు.
గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సమయంలో సామన్య వ్యక్తిలాగే ఆయన ప్రసంగాలు వినేవాడిని అని పవన్ గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి ప్రధాని వ్యక్తి అయితే బాగుంటుందని అప్పుడే అనుకున్టన్లు చెప్పారు. మోదీ నాయకత్వం అంటే తనకెంతో ఇష్టమనీ.. పెద్దన్నలాగా ధైర్యం ఇచ్చి.. రాజకీయాల్లో భుజం తట్టిన వ్యక్తి అంటూ మోదీపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు.