కీలక నిర్ణయం తీసుకున్న సీయం
By - Nellutla Kavitha | Published on 30 March 2022 3:00 PM GMTఇటీవలే పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భగవంత్ మాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పంజాబ్ ను ఉడ్తా పంజాబ్ కాకుండా భడ్తా పంజాబ్, ఉట్తా పంజాబ్ గా చేస్తానంటూ ప్రకటించిన భగవంత్ మాన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పలు కీలక నిర్ణయాలను ప్రకటిస్తున్నారు.
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న 25 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెనువెంటనే ఇంటింటికి రేషన్ డెలివరీ సదుపాయం కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే మరో కీలక ప్రకటన చేశారు. ప్రైవేటు పాఠశాలలు ఏవీ ఫీజులు పెంచకుండా నిషేదం విధించడంతో పాటుగా తక్షణమే ఆ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం కానున్న సమయంలో ఏ ప్రైవేటు విద్యా సంస్థ కూడా ఫీజులు పెంచవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు గానే పుస్తకాలు, యూనిఫాం వంటివి తాము చెప్పిన చోటనే కొనాలంటా పేరెంట్స్ పై ఒత్తిడి తేవద్దంటూ ఆయన సూచించారు. విద్యా రంగానికి సంబంధించి ఈ రోజు రెండు కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నట్లు భగవంత్ మాన్ వీడియో సందేశాన్ని విడుదలచాశారు. విద్యా రంగం పై దృష్టి పెట్టిన పంజాబ్ ముఖ్యమంత్రి త్వరలోనే పూర్తిస్థాయి విధివిధానాలను రూపొందిస్తున్నట్లుగా ప్రకటించారు.
ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. పంజాబ్ లో భారీ మెజారిటీ సాధించడంతో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ అభివృద్ధికి కావలసిన సమూల ప్రక్షాళన చేస్తానని భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం రోజే ప్రకటించారు. చెప్పిన విధంగానే ఆయన కీలక నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.