నేపాల్ విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మృతి
By - Nellutla Kavitha | Published on 30 May 2022 6:44 PM ISTనేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణాలతో లేరని తెలుస్తోంది. ఈ విమాన ప్రమాద శకలాలు అధికారులకు లభ్యమయ్యాయి. వీటి నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం ఈరోజు 14 మృతదేహాలను వెలికితీసింది.
విమానంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ప్రమాదంలో మరణించినట్లు అనుమానిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. తమ ప్రాథమిక దర్యాప్తులో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని అర్ధం అవుతోందని, అయితే ఇంకా ఎక అధికారిక ప్రకటన రావాల్సి ఉందని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫణీంద్ర మణి పోఖ్రెల్ తెలిపారు. మరోవైపు సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు కూడా 14 మృతదేహాలు లభించాయని, నలుగురు భారతీయులు సహా మొత్తం 22 మంది విమానంలో ఉన్నారని చెప్పారు.
నేపాల్‌లో ఆదివారం కనిపించకుండా పోయిన తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ట్విన్ ఇంజిన్ విమానం, నేపాల్‌లోని పొఖారా నుంచి జోమ్‌సోమ్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్ కంట్రోల్ సిస్టమ్‌తో కమ్యూనికేషన్ కోల్పోయి, కనిపించకుండా పోయింది. నేపాల్ లోని ముస్తాంగ్ జిల్లాలోని కోవాంగ్‌లో ఈ విమానం జాడను ఆదివారం సాయంత్రమే ఆర్మీ బృందాలు గుర్తించాయి.