దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు షాక్..విక్టరీ వెంకటేష్, రానాపై కేసు

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్, దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్‌లపై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

By Knakam Karthik  Published on  12 Jan 2025 4:58 PM IST
ENTERTAINMENT,TOLLYWOOD, CASE ON ACTERS, VENKATESH, RANA, PRODUCER SURESH

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు షాక్..విక్టరీ వెంకటేష్, రానాపై కేసు

సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీకి షాక్ తగిలింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్, దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్‌లపై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ లీజుకు ఇచ్చిన స్థలంలో హోటల్‌ను కూల్చివేసినందుకు కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

ఇదీ కేసు నేపథ్యం..

ఫిల్మ్‌నగర్‌లోని తమ స్థలాన్ని నందకుమార్ అనే వ్యక్తికి దగ్గుబాటి కుటుంబం లీజుకు ఇచ్చారు. అయితే ఈ నందకుమార్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనుమానితుడిగా ఉన్నారు. లీజుకు తీసుకున్న స్థలంలో దక్కన్ కిచెన్ అనే హోటల్‌ను నిర్వహించేవారు. హోటల్ లీజ్ విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీతో నందకుమార్ వివాదానికి దిగి కోర్టుకెళ్లాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నంద కుమార్ పేరు బయటికి వచ్చింది. 2022 నవంబరులో జీహెచ్​ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్​ను పాక్షికంగా కూల్చివేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని, సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్​ను పూర్తిగా కూల్చేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు శనివారం ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్​ బాబు, రానా, అభిరామ్​లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ పోరాడుతున్నారు. కాగా ఈ నెల 11న నాంపల్లిలో 17వ నంబరు కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని, కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Next Story