అది నిరూపిస్తే బీఆర్ఎస్ ఎంపీలమంతా రాజీనామా చేస్తాం: నామా నాగేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క పైసా ఇవ్వలేదని లోక్‌సభలో వెల్లడించారు నామా నాగేశ్వరరావు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2023 10:00 AM GMTఅది నిరూపిస్తే బీఆర్ఎస్ ఎంపీలమంతా రాజీనామా చేస్తాం: నామా నాగేశ్వరరావు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని.. వివక్ష చూపిస్తోందని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వాదిస్తున్న విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా కేంద్రం తీరుని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది ఎక్కువ.. తిరిగి తెలంగాణకు కేంద్రం ఇచ్చింది తక్కువ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. బీజేపీ కూడా తెలంగాణ మంత్రుల విమర్శలను తిప్పికొడుతూనే ఉంది. లెక్కలు మా దగ్గర ఉన్నాయంటూ పలువురు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈక్రమంలో పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క పైసా ఇవ్వలేదని లోక్‌సభలో వెల్లడించారు బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు. కేంద్రం నిధులు ఇచ్చామని చెబుతోందని అన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తాము కాళేశ్వరానికి డబ్బులు ఇచ్చామని నిరూపిస్తూ బీఆర్ఎస్ ఎంపీలమంతా రాజీనామా చేస్తామని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడిన నామా నాగేశ్వరరావు.. బీజేపీ ఎంపీలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై బీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంటే దాదాపు 9 ఏళ్లకు పైగా తెలంగాణకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉక్కు కర్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణకు ఇవ్వకుండా మహారాష్ట్ర, గుజరాత్‌లో కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారంటూ గుర్తు చేశారు. ప్రగతి బాటలో పయణిస్తోన్న తెలంగాణకు ఇప్పటికైనా కేంద్రం చేయూత అందిస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అయితే.. నామా నాగేశ్వరరావు వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తప్పుబట్టారు. ఆయన అన్నీ అబద్ధాలే చెబుతున్నారని అన్నారు. నామాపై నిషికాంత్ దూబె పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.86వేల కోట్లు ఇచ్చిందని అన్నారు. ఈ క్రమంలో ఎంపీ నిషికాంత్‌పై బీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు.