జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు.

By Srikanth Gundamalla  Published on  8 April 2024 5:58 PM IST
megastar chiranjeevi, fund, janasena, pawan kalyan,

జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌ దగ్గరలో ఉన్న పోచంపల్లి ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవిని పవన్ కల్యాణ్ కలిశారు. విశ్వంభర షూటింగ్‌ జరుగుతుండగా వెళ్లిన పవన్ ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్‌ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ పార్టీని నడుపుతూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా జనసేన పార్టీకి ఫండ్‌ ఇచ్చారు. రూ. 5 కోట్ల విరాళం అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి వెంట ఆయన మరో సోదరుడు నాగబాబు కూడా ఉన్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి.. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌కు విరాళం ఇస్తున్న ఫొటోలను జనసేన తన ఎక్స్‌ అధికారిక ఖాతాలో పోస్టు చేసింది. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని పొగుడుతున్నారు.

ఇక మరోవైపు ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే సీట్ల పంపకాలు పూర్తయి.. అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. వైసీపీ ఓట్లు చీలకూడదనీ.. రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలనే తాము టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌ చెప్పారు. ఇక సీట్లు తక్కువగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కాగా.. ఏపీలో రెండు లోక్‌సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులు ఖరారు కాగా.. పవన్‌ కల్యాణ్‌ విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా.. జనసేన చీఫ్ పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయగా.. రెండు చోట్లా ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే.


Next Story