కర్ణాటకలో మొదలైన మరో వివాదం - ఏకమైన నేతలు, నటులు
By - Nellutla Kavitha | Published on 28 April 2022 2:03 PM GMTకర్ణాటక రాష్ట్రంలో మరో వివాదం రాజుకుంది. విద్యాలయాల్లో హిజాబ్ అంశం తర్వాత ఇప్పుడు జాతీయ భాషపై చర్చ, వివాదం కొనసాగుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు, సినీ నటులు ఇప్పుడు దానికి మద్దతు పలుకుతున్నారు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ల మధ్య జాతీయ భాషపై జరిగిన చర్చకు ఇప్పుడు కొనసాగింపుగా కన్నడ రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. దీనికి తోడు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సహా ప్రతిపక్ష నేతలు కూడా సుదీప్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
హిందీ జాతీయ భాష కాబట్టే కన్నడ సినిమాలని కూడా హిందీలోకి డబ్ చేస్తున్నారు అంటూ అజయ్ దేవగణ్ చేసిన వ్యాఖ్యల్ని సుదీప్ ఖండించారు. భాషల వల్లే రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అన్ని మాతృ భాషలు అత్యున్నతమైనవని, సుదీప్ చేసిన వ్యాఖ్యల్ని తాము సమర్థిస్తున్నామని ముఖ్యమంత్రి సహా ప్రతిపక్ష నేతలు సుదీప్ మద్దతుగా వ్యాఖ్యానించారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, సుదీప్ అన్న మాటలు సరైనవే అంటూ, అందరూ వాటిని గౌరవించాలి అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇక సుదీప్ కి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామి కూడా మాట్లాడుతూ అజయ్దేవగన్ పై ఘాటు విమర్శలు చేశారు. హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదని, భాష వైవిధ్యాన్ని గుర్తించడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని ట్వీట్ చేశారు సిద్ధరామయ్య. భారతీయ జనతా పార్టీ జాతీయ వాదానికి మారుపేరుగా అజయ్ మాట్లాడారని, మొదటినుంచి హిందీ ఆధారిత పార్టీలు, ప్రాంతీయ భాషలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని కుమారస్వామి విమర్శించారు.
ఇటీవల విడుదలైన దక్షిణాది సినిమాలు ప్రపంచ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని, పాన్ ఇండియా పేరుతో విడుదలైన ఈ సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయని హీరో సుదీప్ అన్నారు. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ లో సుధీర్ మాట్లాడుతూ కన్నడ చిత్ర పరిశ్రమ పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తోందని కొందరు అంటున్నారు కానీ అది నిజం కాదు, పాన్ ఇండియా స్థాయి కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని అలరించేలా ఈ చిత్రాల్ని నిర్మిస్తున్నాం, ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు, హిందీ పాన్ ఇండియా చిత్రాల్ని రూపొందిస్తున్నారు, తమ సినిమాల్ని తమిళం, తెలుగు, కన్నడ, ఇలా దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేసినా విజయం సాధించలేకపోతున్నారు…అంటూ సుదీప్ వ్యాఖ్యానించారు. దీనిపై అజయ్ దేవగణ్ స్పందించారు. హిందీ ఎప్పటికీ జాతీయ భాషేనని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారాయి.
మరోవైపు కన్నడ సినీ నటులు కూడా సుదీప్ అండగా నిలుస్తున్నారు. అజయ్ దేవగణ్ చేసిన వ్యాఖ్యల్ని అహంకారపూరితమైనవని గా, అజ్ఞానానికి నిదర్శనం అభివర్ణిస్తున్నారు. హిందీ మా జాతీయ భాష కాదు కిచ్చా సుదీప్ సర్ మేము మీకు మద్దతిస్తున్నాం అని ట్వీట్లు చేస్తున్నారు కన్నడ నటులు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ అంశం మీద స్పందించారు. భారతదేశం అంతా ఒకటేనని ఉత్తర, దక్షిణాలూ లేవంటూ నే శాండల్ వుడ్ కు చెందిన కేజిఎఫ్ 2 సినిమా ఇటీవల సృష్టించిన రికార్డులను ఉదహరిస్తూ, విడుదలకు సిద్దంగా ఉన్న అజయ్ దేవగణ్ సినిమా గురించి కూడా మాట్లాడాడు ఆర్జివి.