దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని కేటీఆర్ అన్నారు. 2014 నుండి జరిగిన ఎన్నికల్లో తాము విజయాలను నమోదు చేశామని.. ఏ ఎన్నికల్లో గెలిచినప్పుడైనా పార్టీ అధ్యక్షుడుగానీ, నాయకులు గానీ.. పొంగిపోలేదన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన 62వేల మంది పైచీలుకు ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికల్లో పార్టీ పిలుపు మేరకు పని చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో తాము ఆశించినట్లుగా ఫలితం రాలేదని.. రాజకీయాల్లో సహజంగా పోటీ చేసిన వారంతా గెలుపు కోసమే ప్రయత్నం చేస్తారని, విజయం సాధించాలని, ప్రజల మెప్పు పొందాలని పని చేస్తామన్నారు. ఈ ఆరున్నరేళ్ల కాలంలో ఎన్నో విజయాలను నమోదు చేశామని, ఈ సారి మాత్రం ఆశించిన ఫలితం రాలేదన్నారు. ఈ ఎన్నిక పార్టీని, తమను అప్రమత్తం చేసిందని, మా నాయకులకు ఒక హెచ్చరికలా ఈ ఓటమిని భావిస్తామన్నారు. పరాజయానికి కుంగిపోకుండా సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతాని పేర్కొన్నారు.