ఏపీ, తెలంగాణకు తాగునీటిని కేటాయించిన కేఆర్ఎంబీ
కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 April 2024 11:05 AM GMTఏపీ, తెలంగాణకు తాగునీటిని కేటాయించిన కేఆర్ఎంబీ
వేసవి కాలం వచ్చేసింది. తీవ్ర ఎండలు ఓ వైపు దంచి కొడుతున్నాయి. మరోవైపు నీటి కష్టాలు కూడా ప్రజలను వెంటాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నీటి ఎద్దడి కనిపిస్తోంది. ఈ క్రమంలోకే కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్ జలాశయంలో 500 అడుగులపైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి కోసం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక అందుబాటులో ఉన్న 14 టీఎంసీ నీటిలో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టీఎంసీల నీటిని కేఆర్ఎంబీ కేటాయించింది.
హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే నేతృత్వంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ఈఎన్సీ అనిల్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయంపై చర్చించారు.
కృష్ణా జలాల్లో ఏపీ ఎక్కువ మొత్తాన్ని వినియోగించుకుందని.. అంత లెక్కలోకి రాలేదని తెలంగాణ ఈఎన్సీ అనిల్ చెప్పారు. శ్రీశైలం నుంచి ఏపీ ఎలాంటి అవసరాలకైనా నీరు తీసుకోకుండా చూడాలన్నారు. సాగ్ దిగువన తమకు తాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనీ.. ట్యాంకర్లతో నీరు సరఫరా చేసుకోవాల్సి వస్తోందని ఏపీ ఈఎన్సీ వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది తాగునీటి కోసం సాగర్ పై ఆధారపడ్డారని తెలంగాణ ఈఎన్సీ వివరించారు. హైదరాబాద్‌లో ఎక్కువ మొత్తంలో జనాభా ఉంటారనీ.. వారిని దృష్టిలో ఉంచుకుని నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు.
ఇక ఇరు రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న కృష్ణా రివర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్‌లో 500 అడుగలపైన ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలకు కేటాయించింది. ఆ తర్వాత ఈ సమావేశాన్ని ముగించారు. మే నెలలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.