ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌

By Nellutla Kavitha  Published on  23 May 2022 4:53 PM GMT
ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌

సంచలనం సృష్టించిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో MLC అనంత బాబు అరెస్ట్ చేసారు పోలీసులు. వివరాలను కొద్దిసేపటి క్రితం కాకినాడ జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు.

అనంతబాబుకు సుబ్రహ్మణ్యం రూ.25 వేలు ఇవాల్సి ఉందని, ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగిందన్నారు. దాంతో కోపంతో అనంతబాబు, సుబ్రహ్మణ్యాన్ని వెనక్కి నెట్టడంతో గ్రిల్‌ వల్ల అతని తలకు గాయం కావడంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

ఈ సంఘటనలో ప్రాధమికంగా మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తులో మౌఖిక సాక్ష్యాలతో పాటు సాంకేతిక పరమైన ఆధారాలు , ఫోరెన్సిక్ సైన్స్ పరమైన సాక్ష్యాలు, ఫోరెన్సిక్ మెడిసిన్ పరమైన సాక్ష్యాలు, ముద్దాయిని విచారించిన దానిని బట్టి తెలిసిన అంశాల ఆధారంగా ప్రధాన నిందితుడు అయిన MLC అనంత సత్య ఉదయ భాస్కర్ (47 సం.) ను ఈ రోజు ఉదయాన్నే దర్యాప్తు అధికారి అయిన కాకినాడ DSP V.భీమారావు బృందం అరెస్ట్ చేసింది.

ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో ప్రాధమికంగా MLC అనంత సత్య ఉదయ భాస్కర్ ను ప్రధాన ముద్దాయిగా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున, దర్యాప్తులో పురోగతి ఆధారంగా తదుపరి విషయాలను తెలియచేస్తామన్నారు పోలీసులు. ముద్దాయి అనంత బాబు ను కాకినాడ GGH లో తగిన వైద్య పరీక్షలు చేయించిన తర్వాత, రిమాండ్ రిపోర్ట్ తో కాకినాడ స్పెషల్ మొబైల్ JFCM కోర్ట్ నందు హాజరు పరుస్తారు. కోర్ట్ ఆదేశాల మేరకు అతనిని సంబంధిత జైలుకు తరలిస్తామని ప్రకటించారు కాకినాడ జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు.

Next Story
Share it