ప్రమాణస్వీకారం తర్వాత రామోజీరావుని కలుద్దామనుకున్నా: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆయన నివాసానికి వెళ్లి పూలమాల వేసి అంజలి ఘటించారు.
By Srikanth Gundamalla Published on 8 Jun 2024 1:37 PM GMTప్రమాణస్వీకారం తర్వాత రామోజీరావుని కలుద్దామనుకున్నా: పవన్
రామోజీరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామోజీరావు పార్థివదేహాన్ని ఫిలింసిటీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. రామోజీరావు పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు నివాళులర్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆయన నివాసానికి వెళ్లి పూలమాల వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన కల్యాణ్ రామోజీరావుని చాలా ప్రభుత్వాలు వేధించాయని అన్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వమూ నిలబడలేదని చెప్పారు. గత 15 ఏళ్లుగా రామోజీరావు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అయినా రామోజీరావు ఎంతో ధృడంగా నిలబడ్డారని అన్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వమూ నిలబడలేదనీ.. ఆ విషయమే రామోజీరావుతో చెప్పాలని అనుకున్నానని అన్నారు. ప్రమాణస్వీకారం తర్వాత రామోజీరావుని కలుద్దామని అనుకున్నట్లు చెప్పారు పవన్. కానీ.. అంతలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉందని చెప్పారు. ఎందరో జర్నలిస్టులు ఆయన స్కూల్ నుంచి వచ్చినవారేనని అన్నారు. రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన లోటు ఎప్పటికీ తీర్చలేదని భావోద్వేగమయ్యారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.