అత్యంత వేడి గ్రహం గుట్టు విప్పే పరిశోధనకు ఇస్రో సన్నద్ధం
By Nellutla Kavitha Published on 5 May 2022 5:04 PM GMTఅంతరిక్ష పరిశోధనలో ఎన్నో విజయవంతమైన మైలురాళ్లను తన ఖాతాలో సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో ఇప్పుడు మరో పరిశోధనకు సిద్ధమైంది. చంద్రుడు, గురు గ్రహం పై స్పేస్ క్రాఫ్ట్ లను పంపి, ప్రయోగాలను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఇప్పుడు మరో గ్రహం మీదికి పరిశోధనలకు వ్యూహరచన సిద్ధం చేస్తున్నారు.
సౌరమండలం లోనే అత్యంత వేడి గ్రహం గా పేరున్న శుక్రుడి రహస్యాల గుట్టువిప్పేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. వీనస్ మిషన్ ను 2024 డిసెంబర్ నాటికి చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. శుక్ర గ్రహం పై చేపట్టబోయే ప్రాజెక్టు- వీనస్ మిషన్ కోసం నివేదికను సిద్ధం చేసినట్టు ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ ప్రకటించారు. దీంతోపాటుగా అవసరమైన నిధులు కూడా సమకూరినట్టుగా ఆయన ప్రకటించారు. సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం అయిన శుక్ర గ్రహం ఉపరితలం కింద ఏముంది? అత్యంత విషపూరిత సెల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు కింద రహస్యాలను అధ్యయనం చేయడం ప్రాజెక్ట్ లక్ష్యాలుగా ఇస్రో నిర్ణయించుకుంది.
భూమి శుక్రుడు ఒకే వరుసలోకి రానున్నందున 2024 డిసెంబరు లో అంతరిక్ష నౌకను కక్ష్యలోకి చేర్చాలని భావిస్తోంది ఇస్రో. భారత్ వద్ద తగిన సామర్ధ్యము ఉన్నందున, తక్కువ సమయంలోనే వీనస్ మిషన్ను ప్రయోగించగలమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. తిరిగి మళ్ళి భూమి, శుక్రుడు ఒకే వరుసలోకి 2031 లో మాత్రమే రానున్నారు. ఈ పరిశోధన ద్వారా శుక్రగ్రహంలో ఉన్న వాతావరణాన్ని, శుక్రగ్రహ ఉపరితలాన్ని పరిశీలిస్తారు. దీంతోపాటుగా అక్కడ ఉన్న అగ్నిపర్వతాల ఆనవాళ్ళతో పాటుగా, లావా ప్రవాహ మార్గాలను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తిస్తారు.
ఈ ప్రయోగానికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసింది ఇస్రో. ఎలాంటి లోటుపాట్లు లేకుండా కచ్చితంగా విజయవంతం చేయడానికి ఇస్రో పట్టుదలతో ఉంది. ఇప్పటికే శుక్ర గ్రహం మీద పరిశోధన కోసం నాసా తో పాటుగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్టులను ప్రకటించాయి. భూమిని పోలి ఉండే అంతుచిక్కని గ్రహంగా శుక్రగ్రహాన్ని అభివర్ణిస్తుంటారు. ఇందుకోసం నాసా ఒక బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది.