నేపాల్‌కు వీలైనంత సాయం చేస్తాం: ప్రధాని నరేంద్ర మోదీ

నేపాల్‌లో అర్ధరాత్రి భూప్రకంపనలు తీవ్ర విషాదాన్ని నింపింది.

By Srikanth Gundamalla  Published on  4 Nov 2023 12:15 PM IST
indian govt, helps nepal,  earthquake, pm modi,

 నేపాల్‌కు వీలైనంత సాయం చేస్తాం: ప్రధాని నరేంద్ర మోదీ

నేపాల్‌లో అర్ధరాత్రి భూప్రకంపనలు తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా దేశ ప్రజలను హడలెత్తించింది. ఈ భూంకప ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెయ్యి మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. పలు ఇళ్లు, భవనాలు భూకంపం ధాటికి నేలమట్టం అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నేపాల్‌ సంభవించిన భూకంపం ఎఫెక్ట్‌ ఇటు భారత్‌లోనూ పడింది. ఢిల్లీలోనూ భూమి స్వల్పంగా కంపించింది. దాంతో.. ప్రజలంతా రోడ్లమీదకు పరుగులు తీశారు.

అయితే.. భూకంపం ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిన నేపాల్‌కు అండగా ఉంటామని భారత్‌ ప్రకటించింది. స్వయంగా ఈ విషయంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ సవాల్‌ను దాటేందుకు నేపాల్‌కు అవసరమైన సాయం తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు పెట్టారు. నేపాల్‌లో భూకంపం దాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇది చాలా విచారించాల్సిన విషయం అని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేపాల్‌కు అన్ని విధాలా అండగా ఉండేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. వీలైనంత వరకు నేపాల్‌కు సాయం చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రమాదంలో కుటుంబ సభ్యులను, అయినవారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. అలాగే భూకంప సంఘటనలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

శుక్రవారం అర్ధరాత్రి నేపాల్‌లో ఉన్నట్లుండి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రతను 6.4గా అధికారులు గుర్తించారు. చాలా భవనాలు భూకంపం దాటికి నేలకూలాయి. అయితే.. అర్ధరాత్రి భూకంపం సంభవించడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెబుతున్నారు. నిద్రలో ఉండగానే చాలా మంది భవనాల శిథిలాల్లో చిక్కుకుని చనిపోయారు. ఇక ఇంకొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఈ భూకంపం ప్రభావం ఢిల్లీ-NCRలోనూ కనిపించింది. నేపాల్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు, ప్రజలకు సాయం అందించేందుకు ఆ దేశ సైన్యం రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Next Story