చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ టీం - థామస్ కప్ సొంతం
By - Nellutla Kavitha | Published on 15 May 2022 5:43 PM IST73 ఏళ్ల థామస్ కప్ చరిత్ర లో తొలిసారి కప్ గెలుచుకుంది భారత బ్యాడ్మింటన్ బాయ్స్ టీం. 14 సార్లు చాంపియన్ షిప్ గెల్చుకున్న ఇండోనేషియాను ఓడించి చరిత్ర సృష్టించారు భారత షట్లర్లు. 3-0 తో ఓడించిన ఇండియన్ టీం కు ప్రధాని నరేంద్ర మోది సహా దేశమంతా అభినందనలు తెలుపుతోంది.
2022 థామస్ కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. కప్ ఫైనల్ మ్యాచ్ లో 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0 తో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది టీం. ఈరోజు థాయ్‌లాండ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత షట్లర్లు 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0 తేడాతో ఓడించి తన మొదటి థామస్ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
భారత షట్లర్లు లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ షెట్టీ, కిదాంబి శ్రీకాంత్ 3-0తో చారిత్రాత్మక విజయం సాధించారు. ఈ విజయం దశాబ్దాల ఎదురుచూపును తెరదించడంతో క్రీడాలోకం హర్షం వ్యక్తంచేస్తోంది. ఈ విజయంతో మరో రికార్డ్ క్రియేట్ చేసింది మన టీం. చైనా, ఇండోనేషియా, జపాన్, డెన్మార్క్, మలేషియా తర్వాత థామస్ కప్ టైటిల్ సాధించిన ఆరో దేశంగా కూడా భారత షట్లర్లు నిలిచారు.
థామస్ కప్ తో మొదటిసారి దేశానికి స్వర్ణం అందించిన టీంకు క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాకుర్ కోటి రూపాయల నజరానా ప్రకటించారు. భారత జట్టు విజయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. థామస్ కప్ గురించి చదువుతూ తాను పెరిగారని, అప్నా టైం ఆగయా అని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా.