ఇమ్రాన్ ఖాన్ కు మొదలైన కష్టాలు

By -  Nellutla Kavitha |  Published on  30 March 2022 7:40 PM IST
ఇమ్రాన్ ఖాన్ కు మొదలైన కష్టాలు

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదవి గండం తప్పేట్లు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. దీనిపై రేపు చర్చ జరగనుంది. ఇక ఏప్రిల్ 3న ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పాకిస్తాన్ తహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు ఇప్పటికే రెబెల్స్ గా మారారు. దీంతోపాటుగా ఇప్పటి వరకు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మిత్రపక్షం కూడా తన మద్దతును ఉపసంహరించుకుంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ముందే మిత్రపక్షం ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకుంది.

పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభానికి ఇమ్రాన్ఖాన్ కారణమయ్యారు అంటూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 మంది సభ్యుల బలం అవసరం ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ సొంత పార్టీ రెబల్స్, ప్రతిపక్ష సభ్యుల మొత్తం సంఖ్య ఇప్పుడు 175 చేరుకుంది. దీంతో పాటే మిత్రపక్షం కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇమ్రాన్ఖాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు మాజీ కెప్టెన్ ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు పోరాడుతారని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ అన్నారు.

ఇక ఇవాళ సాయంత్రం జాతినుద్దేశించి ఇమ్రాన్ఖాన్ ప్రసంగించాల్సి ఉన్నా అది వాయిదాపడింది. మిత్ర పక్షం ప్రతిపక్షం తో చేతులు కలపడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈరోజు మధ్యాహ్నం తన క్యాబినెట్ తో భేటీ అయిన అనంతరం ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తదుపరి ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ను ఎన్నుకోపోతున్నట్లుగా పాకిస్థాన్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రజలు త్వరలోనే శుభవార్త వింటారు అని బిలావల్ భుట్టో అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఖాన్ రాజీనామా చేస్తారా లేకుంటే చివరి బంతి వరకు పోరాడుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాలు మాత్రం ఈ అంతర్జాతీయ మాజీ క్రికెటర్ త్వరలోనే మాజీ ప్రధాని కాబోతున్నారని ప్రచారాలు మొదలుపెట్టారు.

Next Story