మ‌రోమారు కేరళలో భారీ వర్షాలు

కేరళలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో హెచ్చరికలు చేసింది.

By Kalasani Durgapraveen  Published on  11 Oct 2024 10:43 AM IST
మ‌రోమారు కేరళలో భారీ వర్షాలు

కేరళలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో హెచ్చరికలు చేసింది. కేరళలోని దక్షిణ, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా దక్షిణాది జిల్లాలైన తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్టతో పాటు ఉత్తర జిల్లాలైన మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్ లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

24 గంటల్లో 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రాంతాల్లోని ప్రజలు స్థానిక అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్డీఎంఏ) సూచించింది.

కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల గురించి హెచ్చరికలతో పాటు.. నదీ తీరాలకు సమీపంలో మరియు ఆనకట్టల సమీపంలోని లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు నీటి మట్టాలు పెరగడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోవాలని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు వరదలను ముందుగానే అంచనా వేయాలని సూచించారు.

Next Story