పేద విద్యార్థులను పట్టి పీడిస్తున్న సాయి తేజ కాలేజ్

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని సాయి తేజ ఇంటర్, డిగ్రీ కళాశాల పేద విద్యార్థుల నుండి భారీగా డబ్బును దండుకుంటూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jun 2024 2:52 PM GMT
Hyderabad, sai teja college, Collecting money illegally  ,

పేద విద్యార్థులను పట్టి పీడిస్తున్న సాయి తేజ కాలేజ్ 

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని సాయి తేజ ఇంటర్, డిగ్రీ కళాశాల పేద విద్యార్థుల నుండి భారీగా డబ్బును దండుకుంటూ ఉంది. తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్యను అందిస్తామంటూ చెప్పిన కళాశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటూ ఉంది. ఇంటర్మీడియట్ కోర్సుకు సంవత్సరానికి 14000-16000 మాత్రమే ఫీజు వసూలు చేస్తామని మొదట చెప్పారు.. ప్రభుత్వ కళాశాలలతో పోలిస్తే నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.. తీరా కళాశాలలో చేర్చుకుని ఆ తర్వాత అధిక ఫీజులు వసూలు చేయడం మొదలుపెట్టారు.

కళాశాల యాజమాన్యం మాటలను నమ్మి.. పిల్లలను చేర్పించారు. అయితే విద్యార్థుల పేరు మీద బ్యాంకు అకౌంట్లు తీసి ప్రభుత్వం వేసిన స్కాలర్ షిప్ లను యాజమాన్యం కాజేసింది. ప్రతి ఏడాది ఒక్కో అకౌంట్ నుండి 5000 రూపాయలు కాలేజీ యాజమాన్యం విత్ డ్రా చేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అకౌంట్ల తో విద్యార్థులకు ఎలాంటి యాక్సిస్ లేకుండా చేశారని తెలుస్తోంది. ఇవే కాకుండా దీనికి అదనంగా కళాశాల పరీక్ష రుసుము రూ.1100 మొదటి సంవత్సరం.. రెండవ సంవత్సరానికి 1700 కింద వసూలు చేస్తూ వచ్చారు.

చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కళాశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్ వెల్ పార్టీని నిర్వహిస్తుంది. ఇందు కోసం విద్యార్థులు హాజరైనా, హాజరుకాకపోయినా రూ.600 వసూలు చేస్తారు.

సాయి తేజ జూనియర్ కళాశాలలో రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫీజు కోసం 16000 రూపాయలు వసూలు చేస్తారు. ఇక స్కాలర్ షిప్ డబ్బులు 5000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇలా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సు ఖర్చు రూ. 40,000 దాటుతూ ఉండడం విద్యార్థుల కుటుంబాలకు భారంగా మారనుంది. చాలా మంది లెక్చరర్లు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉండటంతో, లెక్చరర్లు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు అవ్వడం గగనమే!! దీంతో విద్యలో నాణ్యత కూడా లోపించింది. విద్యా సంవత్సరం ముగిసే ముందు ఆఖరి 2-3 నెలల్లో సిలబస్ ను కవర్ చేస్తారు. ఇక విద్యా సంవత్సరం పూర్తయ్యాక.. కళాశాల నుండి బయటకు రావడం కూడా కష్టమే!!

ఇక రెండో ఏడాది ప్రభుత్వం నుండి స్కాలర్ షిప్ డబ్బులు వచ్చాకనే విద్యార్థులకు మార్క్స్ మెమోను అందిస్తారు. ఇక టీసీ అందుకోవాలంటే తప్పకుండా 2000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.

Next Story