విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో ఈతకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 29 July 2024 7:25 AM ISTవిషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో ఈతకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే.. స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్‌రెడ్డి, సమంత దంపతులు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కూతుళ్లకు ఇద్దరికీ పెళ్లిళ్లు చేశారు. కుమారుడు అక్షిత్‌రెడ్డిని పై చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికాకు పంపించారు. షికాగోలో ఎంఎస్ పూర్తి చేసిన అక్షిత్‌రెడ్డి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.
లైఫ్‌లో అక్షిత్‌రెడ్డి స్థిరపడ్డాడనీ..అతనికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. కానీ.. అంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. గత శనివారం అక్షిత్‌రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి లేక్ మిశిగన్‌లో ఈతకు వెళ్లాడు. ఒకరు ఒడ్డునే ఉండిపోగా మిగతా ఇద్దరూ నీటిలోకి దిగి చెరువు మధ్యలో ఉన్న రాయి వరకూ వెళ్లారు. చాలా శ్రమకోర్చి అక్కడి వరకూ వెళ్లగా తిరిగొచ్చే క్రమంలో అక్షిత్‌రెడ్డి అలసిపోయి నీట ముగిపోయాడు. అతడి స్నేహితుడూ నీట మునిగిపోగా స్థానికులు కాపాడారు. దీని గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్షిత్‌రెడ్డి డెడ్‌బాడీ కోసం గాలించి.. బయటకు తీశారు. శనివారం అక్షిత్‌రెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆదివారం అడ్డాకులలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను జరిపారు.