నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు.

By Srikanth Gundamalla  Published on  13 Nov 2023 5:57 AM GMT
Hyderabad, fire accident, nampally,

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం, ఆరుగురు సజీవదహనం

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి వేళ పలు చోట్ల మంటలు అంటుకుని ప్రమాదాలు సంభవించగా..తాజాగా నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ ఘాట్‌లో ఉన్న ఓ కెమికల్‌ గోదాంలో మంటలు చెలరేగాయి. దాంతో.. మంటలు చుట్టుపక్కల వేగంగా వ్యాపించాయి. అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. అయితే.. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చాయి. డీజిల్‌ ద్వారా మంటలు మరింత వ్యాపించాయి. దాంతో.. అప్రమత్తమైన స్తానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కెమికల్ గోదాం డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ అగ్నికీలల్లో చిక్కుకుని కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగ వ్యాపించడం ద్వారా పలువురు అస్వస్థతకు గురయ్యారు. మంటల్లో చిక్కుకుని మరికొందరికి గాయాలు అయ్యాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు సంఘటనాస్థలిలోనే చనిపోగా.. ఇంకొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు పురుషులు ఉండగా.. ఐదుగురు మహిళలు, ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు అధికారులు.

కాగా.. ప్రమాదం గురించి స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో... వెంటనే ఫైరింజన్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఆర్ఎఫ్‌ సిబ్బంది, ఫైర్ సిబ్బంది కూడా వెంటనే ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవనంలో చిక్కుకున్న దాదాపు 15 మందిని సురక్షితంగా కాపాడారు. భవనంలో చిక్కుకున్న వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో మరోసారి కలవరం రేపుతోంది. అగ్నిప్రమాదంలో కారుతో పాటు పక్కనే ఉన్న బైకులు పూర్తిగా కాలిపోయాయి.

Next Story