Hyderabad: వినాయకుడి వద్ద పెట్టిన దీపంతో హాస్టల్‌లో అగ్నిప్రమాదం
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ గురుకుల పాఠశాలలో మంటలు చెలరేగాయి.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 9:43 AM ISTHyderabad: వినాయకుడి వద్ద పెట్టిన దీపంతో హాస్టల్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ గురుకుల పాఠశాలలో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు విద్యార్థులకు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
షేక్‌పేట్ గురుకుల పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులంతా కలిసి హాస్టల్ గదిలో వినాయకుడిని నిలబెట్టారు. భక్తి శ్రద్ధలతో విద్యార్థులు పూజలు చేస్తున్నారు. అయితే.. దీపం ఆరిపోకుండా ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని భావించారు. శుక్రవారం రాత్రి పూజలో భాగంగా దీపం వెలిగించారు. ఆది ఆరిపోకుడా చూసుకోఆలని భావించి.. వినాయకుడి చుట్టు దుప్పట్లతో తెర ఏర్పాటు చేశారు. అయితే.. రాత్రి గాలి వీయడంతో దుప్పటి దీపానికి తగిలింది. దాంతో.. మంటలు అంటుకున్నాయి. రాత్రి వేళ కావడంతో ముందుగా ఎవరూ గమనించలేదు. మంటలు ఒక్కసారిగా పెద్దవి కావడంతో హాస్టల్ గదిలో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు.
గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో కొందరు బయటకు రాలేకపోయారు. నీరజ్ అనే విద్యార్థికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలు అయ్యాయి. అతడితో పాటు మరో విద్యార్థికి కూడా గాయాలు అయ్యాయి. ఇక వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత గాయాల పాలైన విద్యార్థులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ సంఘటనపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. సకాలంలో విద్యార్థులు బయటకు పరిగెత్తడంతో పెనుప్రమాదం తప్పిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు.