హైదరాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌లో కొంత భాగం నిన్న అర్థరాత్రి కుప్ప కూలింది. పిల్లర్‌కు పిల్లర్‌కు స్లాబ్ చేస్తున్న సమయంలో ఫ్లైఓవర్ ర్యాంప్ కుప్పకూలింది. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదంలో జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో 15 మంది కార్మికులు పని చేస్తున్నారు. బైరామల్ గూడా వైపు నుంచి ఫ్లై ఓవర్ పైకి వెహికిల్స్ ఎక్కే ర్యాంప్ కుప్పకూలింది. రెండు పిల్లర్లకు మధ్య నిర్మిస్తున్న స్లాబ్ కూలడంతో దానిపై పనులు చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా కిందపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వారు ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులు అని తెలిసింది. ఘటనాస్థలాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు జరిపిస్తామన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఘటనా స్థలాన్ని ఇంజినీర్ల బృందం పరిశీలించనుంది. ఫ్లైఓవర్ ర్యాంప్ కూలిపోవడానికి గల కారణాలపై పరిశీలన చేపట్టనుంది. ప్రమాదానికి నాణ్యత లేకుండా నిర్మించడమే కారణమా? లేకా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది ఇంజినీర్ల బృందం తేల్చనుంది.