రాహుల్ ఓయూ పర్యటనపై వీసీదే తుది నిర్ణయమన్న హైకోర్టు

By -  Nellutla Kavitha |  Published on  2 May 2022 12:52 PM GMT
రాహుల్ ఓయూ పర్యటనపై వీసీదే తుది నిర్ణయమన్న హైకోర్టు

రాహుల్ గాంధి ఓయూ పర్యటన పై దాఖలైన హౌజ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం కోసం పెట్టిన అప్లికేషన్ పరిశీలించాలని VC కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విచారణ సందర్భంగా కోర్ట్ కు ప్రభుత్వం కానీ, ఉస్మానియా యూనివర్సిటీ తరుపు న్యాయవాదులు కానీ హాజరుకాలేదు.

ఓయూ వీసీదే తుది నిర్ణయమన్న కోర్టు పిటిషన్ పై విచారణ ముగించింది. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ పర్యటనకు అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు రాసిన లేఖకు యూనివర్సిటీ రిజిష్ట్రార్‌ పప్పుల లక్ష్మీ నారాయణ సమాధానం ఇచ్చారు. ఏ కారణాలతో రాహుల్‌ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నామో వెల్లడించారు. ఓయూ ఆవరణలో రాజకీయ, మత పరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వరాదని గతేడాది జూన్‌ 31న యూనివర్సిటీ ఈసీ నిర్ణయం తీసుకుందని రిజిస్ట్రార్ తన లేఖలో గుర్తు చేశారు. మరోవైపు శాంతిభద్రతల నేపథ్యంలో వర్సిటీలో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని కొన్ని విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని, దీంతోపాటే ఎంబీఏ పరీక్షలకు కొంతమంది విద్యార్థులు సిద్ధమవుతున్నారని అన్నారు. ఈనెల 7న ఓయూ ఉద్యోగుల అసోసియేషన్‌ ఎన్నికలు ఉన్నాయని, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌ నేపథ్యంలో వేలాదిమంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారని అన్నారు.

అయితే రాహుల్ ఓయూ పర్యటనకు సంబంధించి మళ్లీ వీసీకి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపిన నేపథ్యంలో రాహుల్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ సారి దరఖాస్తును వీసీ పరిగణనలోకి తీసుకుంటారని కోర్టు కాంగ్రెస్ నేతలకు సూచించింది. అయితే రాహుల్ ఓయూ పర్యటకు వీసీ అనుమతిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు వీసీ మనసు మార్చుకుంటారా? రాహుల్ పర్యటనకు అనుమతిస్తారా లేదా అన్న ఉత్కంఠ లో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.

Next Story