హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్‌ విశ్వనగరంగా పేరుపొందింది.

By Srikanth Gundamalla  Published on  5 May 2024 8:57 AM IST
good news,  hyderabad,  prime minister modi ,

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్‌ విశ్వనగరంగా పేరుపొందింది. ఈ భాగ్యనగరం రోజురోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మెట్రో పరుగులు తీస్తుండగా.. నగరం చుట్టూ రీజనల్ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు కూడా పట్టాలెక్కబోతుంది. మరోవైపు ఔటర్‌ రింగ్‌ రైల్‌ ప్రతిపాదన కూడా ఉంది. అయితే.. తాజాగా మరో రెండు ప్రాజెక్టులు హైదరాబాద్‌కు వస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్-ముంబై మధ్య హైస్పీడ్‌ రైల్ కారిడార్ రాబోతుంది. ఈ మేరకు ఈ ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక కామెంట్స్ చేశారు.

హైదరాబాద్‌ను అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేసేందుకు కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని ఈ మేరకు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలాగే నగరంలోని అన్ని ప్రాంతాల వారికి సులభమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఎంఎంటీఎస్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని చెప్పారు. వందేభారత్‌ రైలు హైదరాబాద్ నుంచి పరుగులు తీస్తుందనీ.. మరో వందేభారత్‌ మెట్రోను కూడా హైదరాబాద్‌కు తీసుకొస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. తెలంగాణకే కాదు.. దేశానికి కూడా హైదరాబాద్ నగరం ఒక గ్రోత్ సెంటర్ అని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. ఇక ముందు కూడా ఈ సహకారం కొనసాగుతుందని చెప్పారు. రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించి ప్రపంచ పటంలో పెట్టిన ఘనత కూడా కేంద్రానిదే అన్నారు. అలాగే పసుపు బోర్డు అంశంపై ఆయన స్పందించారు. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఖరారు దగ్గర నుంచి అధికారుల గుర్తింపు వరకు పనులు వేగంగా సాగుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విధించిన ఎలక్షన్ కోడ్‌ ఈ పనులపై కొంత ప్రభావం చూపిందని అన్నారు. ఇక తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి వందరోజుల్లోనే ఈ పనులు ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

Next Story