గచ్చిబౌలిలో ఎన్నికల కోసం తరలిస్తోన్న రూ.5 కోట్లు పట్టివేత

తాజాగా గచ్చిబౌలిలో కూడా పోలీసులు భారీగా నగదు సీజ్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  23 Nov 2023 1:15 PM GMT
gachibowli, rs.5 crore, seized, telangana, hyderabad,

 గచ్చిబౌలిలో ఎన్నికల కోసం తరలిస్తోన్న రూ.5 కోట్లు పట్టివేత 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అయినా..కూడా కొందరు డబ్బు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిధిలో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా గచ్చిబౌలిలో కూడా పోలీసులు భారీగా నగదు సీజ్‌ చేశారు.

నవంబర్‌ 23 గురువారు తెల్లవారు జామున గచ్చిబౌలిలో పోలీసులు రూ.5 కోట్ల నగదు పట్టుకున్నారు. శ్రీరాంనగర్‌ కాలనీలోని చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ దగ్గర పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఒక కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అడ్డుకుని కారును తనిఖీ చేశారు గచ్చిబౌలి పోలీసులు. కారులో సూటికేసుల్లో తరలిస్తున్న డబ్బును చూసి షాక్‌ తిన్నారు. వెంటనే సూట్‌కేసులను కిందకు దించి డబ్బును పూర్తిగా తెరిచి చూశారు. ఆ తర్వాత రూ.5 కోట్ల డబ్బుని సీజ్‌ చేశారు. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో హవాలా నగదుగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఇక డబ్బు తరలిస్తోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురూ పెద్దపల్లి జిల్లాకు చెందిన దుగ్యాల సంతోష్‌ రావు (36), ముత్యాల నరేశ్ (36), చీటి సంపత్‌రావు (47)గా గుర్తించారు. పట్టుబడ్డ రూ.5 కోట్ల నగదు పూర్తిగా 500 నోట్లు కావడం గమనార్హం. చివరకు పోలీసులు ఆ డబ్బు మొత్తాన్ని ఇన్‌కమ్‌ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. కాగా.. పట్టుబడ్డ నగదు ఓ రాజకీయ నేతకు చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోసమే డబ్బు తరలిస్తున్నట్లు చెప్పారు.

Next Story