వారంలో అయిదు రోజులే పనిదినాలు

By -  Nellutla Kavitha |  Published on  28 March 2022 5:28 PM IST
వారంలో అయిదు రోజులే పనిదినాలు

మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన బీరేన్ సింగ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, వారంలో ఐదు రోజుల పనిదినాలు ఉండేలా కొత్త జీవోను విడుదల చేశారు. దీంతో మణిపూర్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీ, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిదినాలు కలిగి ఉంటాయి. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉదయం 9 గంటలకు మొదలయ్యే ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం 5:30 వరకు కొనసాగుతాయి. ఇక శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆఫీసు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

తమ ప్రభుత్వం చేపట్టిన 100 ఆక్షన్ పాయింట్లలో తొలి వంద రోజుల్లో భాగంగా శనివారాలు పని చేస్తామని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఇక వారంలో ఐదు రోజులే పని చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ఉద్యోగుల మధ్య సరైన సమన్వయం ఉంటుందని, దీంతో పాటు ఉద్యోగులు వర్క్ - లైఫ్ సరిగ్గా బ్యాలెన్స్ చేయగలుగుతారని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ భావిస్తున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి మరోసారి మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 60 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 32 స్థానాలను బిజెపి గెలుచుకుంది. మణిపూర్లో పన్నెండవ సారి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీర్రేన్ సింగ్ రెండోసారి ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story